సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 26 జూన్ 2023 (17:42 IST)

సినిమాను తలపించేలా దోపిడీ.. అంతా క్షణాల్లో పూర్తి...

robbery
దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలు సినీ ఫక్కీలో భారీ చోరీ జరిగింది. సినిమాను తలపించేలా సాగిన ఈ దోపిడీ అంతా క్షణాల్లో పూర్తయింది. ద్విచక్రవాహనాలపై వచ్చిన దొంగలు కారును ఆపి.. ఆపై గన్స్‌తో బెదిరించి నగల సంచిని దోసుకెళ్లారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ టన్నెల్ వద్ద జరిగిన ఈ దోపిడీ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ వీడియోను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
 
ఎర్రకోట ఏరియాకు చెందిన డెలివరీ ఏజెంట్, అతని సహాయకుడు ఇద్దరూ కలిసి ఓ బ్యాగును గురుగ్రామ్‌లో అందజేసేందుకు కారులో బయలుదేరారు. వారి వద్ద ఉన్న బ్యాగులో నగదు ఉండటంతో రక్షణ నిమిత్తం ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. వీరిద్దరూ కారులో గురుగ్రామ్‌కు బయలుదేరగా, ప్రగతి మైదానా టన్నెల్ గుండా వెళుతుండగా రెండు బైకులపై వచ్చిన నలుగురు దోపిడీ దొంగలు కారును అడ్డగించి ఆపేశారు. 
 
తమ బైకులను అడ్డుపెట్టి కారును ముందుకు కదలకుండా చేశారు. ఆ తర్వాత తమ వద్ద ఉన్న తుపాకీలు చూపించి కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను బెదిరించి, వారివద్ద ఉన్న నగదు సంచిని బలవంతంగా లాక్కొని పారిపోయారు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. టెన్నల్‌లో అమర్చిన సెక్యూరిటీ కెమెరాల్లో ఈ సీన్ మొత్తం రికార్డు అయింది. 
 
ఈ దోపిడీ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. సదరు డెలవరీ సంస్థ ఉద్యోగుల గురించి ఆరా తీస్తున్నారు. సంస్థలోని వ్యక్తులు లేదా వారి సహకారంతో వేరే వాళ్లు ఈ దోపిడీకి పాల్పడివుంటారని అనుమానిస్తున్నారు. 
 
మరోవైపు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ వీడియోను షేర్ చేసి... ఢిల్లీ ఎల్జీ తక్షణం రాజీనామా చేసి ప్రజలను రక్షణ కల్పించే సామర్థ్యం ఉన్న మరొకరిని ఎల్జీగా నియమించేందుకు తోడ్పడాలని కోరారు. శాంతిభద్రతలు పరిరక్షించడం కేంద్రానికి చేతకాకపోతే ఆ బాధ్యతలను ఢిల్లీ సర్కారుకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.