గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 11 మార్చి 2024 (23:14 IST)

పౌరసత్వ సవరణ చట్టం - సీఏఏను అమల్లోకి తెచ్చిన కేంద్రం.. నోటిఫికేషన్ జారీ

amit shah
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) - 2019ను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు సోమవారం కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. 2019లో ప్రతిపక్షాల నిరసనల మధ్య సీఏఏకి ఆమోదముద్ర వేయించుకున్న విషయం తెల్సిందే. అయితే, ఈ చట్టంలోని నిబంధనలపై స్పష్టత లేకపోవడంపై అమలులో ఇన్నాళ్లపాటు జాప్యం జరిగింది. 
 
2019లో సీఏఏ చట్టం తీసుకొచ్చారు. పార్లమెంట్‌లో దీనిపై విపక్షాలు తీవస్థాయిలో నిరసనలు వ్యక్తంచేశాయి. ఉభయసభల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాలకు ఉన్న బలం దృష్ట్యా సీఏఏకి పార్లమెంట్ ఆమోదం లభించడంతో రాష్ట్రపతి కూడా రాజముద్ర వేశారు. అయితే, సీఏఏ నిబంధనలు, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో దీని అమలు ఆలస్యమైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే సీఏఏ అమలుపై నోటిఫికేషన్ విడుదల చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించిన మేరకు సోమవారం కేంద్రం నోటిఫికేషన్ జారీచేసింది. 
 
ఈ చట్టం అమలు తర్వాత పొరుగుదేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్ దేశాల నుంచి ముస్లిమేతరులు వలస వస్తే, వారివద్దసరైన పత్రాలు లేకపోయినా, భారతదేశ పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏ ఉపయోగపడుతుంది. 2014 డిసెంబరు 31వ తేదీకి ముందు ఈ మూడు దేశాల నుంచి భారత్‌లో ప్రవేశించిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, పార్శీలు, జైనులు భారత పౌరసత్వం పొందేందుకు సీఏఏ ఉపకరిస్తుంది. అయితే, ఈ చట్టాన్ని తమతమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని కేరళ, వెస్ట్ బెంగాల్‌తో పాటు పలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తేల్చిచెప్పాయి.