సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 30 నవంబరు 2023 (08:43 IST)

పౌరసత్వ సవరణ చట్టం అమలును ఎవరూ అడ్డుకోలేరు : అమిత్ షా

amit shah
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసంమే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి కొందరు రాజకీయ నేతలు ఈ చట్టాన్ని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) భారత దేశానికి చెందిన చట్టం అని, దీని అమలును ఎవరూ అడ్డుకోలేరన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగానే సీఏఏను వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా విమర్శించారు.
 
'బెంగాల్‌ రాష్ట్రంలోని చొరబాటుదారుల ప్రవేశాన్ని మమతా బెనర్జీ అడ్డుకోలేకపోతున్నారు. బెంగాల్‌లో చొరబాటుదారులకు యధేచ్ఛగా ఆధార్ కార్డులు, ఓటరు కార్డులు మంజూరు అవుతున్నాయి. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ మమతా బెనర్జీ మాత్రం మౌనంగా చూస్తున్నారు. దేశంలోకి చొరబాటుదారుల ప్రవేశానికి ఆమె మద్దతు పలుకుతున్నారు కాబట్టే సీఏఏను వ్యతిరేకిస్తున్నారు. అసోంలో చొరబాట్లను అడ్డుకోవడంలో అక్కడి ప్రభుత్వం విజయవంతమైంది. కానీ బెంగాల్‌లో చొరబాటుదారులకు ఎలాంటి ఆటంకాలు లేవు. అందుకు కారణం టీఎంసీ ప్రభుత్వ ఓటు బ్యాంకు రాజకీయాలే' అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.
 
కాగా, కేంద్ర ప్రభుత్వం 2019లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) తీసుకువచ్చింది. ముస్లిం ప్రాబల్య దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ తదితర దేశాల్లో మత పరమైన హింస, వివక్షకు గురయ్యే మైనారిటీలకు ఆశ్రయం, భారత పౌరసత్వం కల్పించడమే ఈ చట్టం పరమావధి. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్‌లోకి ఎలాంటి పత్రాలు లేకుండా వచ్చిన హిందువులు, సిక్కులు, పార్శీలు, క్రైస్తవులు, బౌద్ధ మతస్తులు, జైనులకు సీఏఏ ద్వారా భారత పౌరసత్వం అందించే వీలుంటుంది. అయితే, ఈ చట్టంలోని మైనారిటీల జాబితాలో ముస్లింలను చేర్చకపోవడం దేశంలో తీవ్ర నిరసనలకు దారితీసింది. దాంతో సీఏఏ అమలు అప్పట్లో నిలిచిపోయింది. తాజాగా ఈ చట్టాన్ని మళ్లీ తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతుంది.