సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2023 (18:00 IST)

27న అమిత్ షా - పవన్ కళ్యాణ్ సమావేశం!!

pawan - amith Shah
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇందులోభాగంగా, ఆ పార్టీ అగ్ర నేతలతో తెలంగాణ బీజేపీ నేతలు వరుసగా సమావేశమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 27వ తేదీన సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో సీట్ల సర్దుబాటుపై వారిద్దరూ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌తో తెలంగాణ బీజేపీ చీప్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్‌‍లు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన ఎన్నికల ప్రచారం కోసం వచ్చే అమిత్ షాతో పవన్ భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా కొన్ని సీట్లలో పోటీ చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తిగా మారింది. 
 
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 32కి పైగా స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే జాబితాను కూడా ఇప్పటికే జనసేన విడుదల చేసింది. ఈ జాబితాలో కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. సూర్యాపేటలో ఈ నెల 27న జరిగే ప్రచార సభలో పాల్గొనేందుకు అమిత్ షా వస్తున్నారు. ఈ సందర్భంగా అమిత్ షాను పవన్ కల్యాణ్ కలవనున్నారు. సీట్ల సర్దుబాటుపై వీరు చర్చించే అవకాశం ఉంది.