గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 22 అక్టోబరు 2023 (15:14 IST)

గజ్వేల్‌లో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్.. బీజేపీ అభ్యర్థి ఎవరో తెలుసా?

etala
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ఆదివారం ప్రకటించింది. భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను దించనుంది. నవంబరు 30వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. 
 
ఇందులో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు రెండు చోట్ల పోటీ చేసే అవకాశాన్ని బీజేపీ పెద్దలు కల్పించారు. సొంత నియోజకవర్గం హుజురాబాద్‌‌తో పాటు గజ్వేల్ నుంచి ఈటల బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ ఇప్పటికే పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. 
 
కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఈటలను బరిలోకి దింపడం ద్వారా బీజేపీ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని చెప్పాలి. సీఎం కేసీఆర్‌పై పోటీ అంటే ఈటల సత్తాకు ఓ అగ్నిపరీక్షతో సమానం. బీజేపీ కూడా ఇది ప్రతిష్టాత్మకమైన అంశం. మరో విషయం ఏమిటంటే కేసీఆర్‌పై పోటీ చేసేందుకు ఈటల తప్పమరో అభ్యర్థి తెలంగాణ బీజేపీలో లేరా అనే చర్చ కూడా ఇపుడు తెరపైకి వచ్చింది. 
 
మరోవైపు, సీఎం కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. కామారెడ్డిలో ఆయనపై బీజేపీ తరపున కె.వెంకట రమణారెడ్డి పోటీ చేస్త్ున్నారు. మొత్తంమీద సీఎం కేసీఆర్ పోటీ చేసే రెండు స్థానాల్లో పోటీ అమితాసక్తిగా మారింది.