శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 29 మే 2019 (13:45 IST)

చెన్నైలో తీవ్ర నీటి కొరత : మెట్రో రైళ్ళలో ఏసీ నిలిపివేత

చెన్నై మహానగరంలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో చెన్నై మెట్రో రైళ్ళలో శీతలీకరణ సౌకర్యం (ఏసీ యూనిట్లు)ను నిలిపివేశారు. ఫలితంగా చెన్నైలో నడిచే మెట్రో రైళ్ళు ఏసీ సౌకర్యం లేకుండానే పరుగులు తీస్తున్నాయి. 
 
చెన్నై మెట్రో రైళ్ళలో ఏసీ సౌకర్యం కోసం ప్రతి రోజూ 9 వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది. కానీ, గత కొన్ని నెలలుగా చెన్నై మహానగరంలో తీవ్రమైన నీటికొరత నెలకొనివుంది. దీంతో నీటి వినియోగాన్ని తగ్గించే చర్యల్లోభాగంగా ఏసీ సౌకర్యాన్ని నిలిపివేశారు. 
 
గత 70 యేళ్ళ కాలంలో ఎన్నడూ లేనివిధంగా చెన్నై మహానగరం నీటి కొరతను ఎదుర్కొంటోంది. చెన్నై నగర దాహార్తిని తీర్చేందుకు అనేక ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ నీటి కొరత మాత్రం తీర్చలేక పోతున్నారు. 
 
ఈ ప్రభావం మెట్రో రైళ్ళతో పాటు మెట్రో రైల్ స్టేషన్లపై కూడా పడింది. ప్రధాన రద్దీ సమయాల్లో మినహా మిగిలిన సమయాల్లో మెట్రో రైళ్ళు ఏసీ సౌకర్య లేకుండానే తిరుగుతున్నాయి. చెన్నై మెట్రోకు ప్రతి రోజూ 9 వేల లీటర్ల నీరు అవసరం కాగా, ఇందులో 80 శాతం నీరు ఏసీ సౌకర్యం కోసమే ఖర్చు అవుతోంది. 
 
దీనిపై మెట్రో రైల్ అధికారులు స్పందిస్తూ, ప్రతి గంటకూ ఏసీలను ఆన్ చేస్తూ, రైళ్లతో పాటు భూగర్భం ఫ్లాట్‌ఫామ్‌లలో టెంపరేచర్ 26 డిగ్రీలు స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ఏసీ ప్లాంట్‌ను ఆఫ్ చేయడం వల్ల 30 శాతం నీటిని సేవ్ చేయవచ్చని తెలిపారు. ప్రతి మెట్రో రైల్ బోగీలో 41 కేవీ ఏసీ యూనిట్ ఉందని, వీటి పనితీరు అద్భుతంగా ఉందని చెప్పారు.