మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (12:13 IST)

ఆస్పత్రిలోకి వర్షపు నీరు.. చెన్నై జలదిగ్బంధం

తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత వారం రోజులకుపైగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో రాజధాని చెన్నై పూర్తిగా నీటిలో చిక్కుకుంది. 
 
స్థానిక కేకే న‌గ‌ర్‌లోని ప్రభుత్వ ఈఎస్ఐ ఆస్ప‌త్రిలోకి భారీగా వ‌ర్ష‌పు నీరు చేరింది. ప‌లు వార్డుల్లోకి వ‌ర్ష‌పు నీరు చేర‌డంతో రోగులు, వారి స‌హాయ‌కులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
ఈ సంద‌ర్భంగా ఈఎస్ఐ ఆస్ప‌త్రి డాక్ట‌ర్ మ‌హేశ్ మాట్లాడుతూ.. ప్ర‌స్తుతం ఉన్న సిబ్బందితో ఔట్ పేషెంట్ సేవ‌లు కొన‌సాగుతున్నాయ‌న్నారు. కొవిడ్ వార్డుల‌తో పాటు ఇత‌ర వార్డుల్లో ఉన్న రోగుల‌కు ఇబ్బంది లేకుండా వైద్య సేవ‌లందిస్తున్నామ‌ని చెప్పారు.
 
మరోవైపు, గత శనివారం రాత్రి నుంచి చెన్నై నగరంపై వరుణదేవుడు కన్నెర్రజేశాడు. ముఖ్యంగా, గత 17 గంటలకుపైగా విడవకుండా వర్షం కురుస్తూనేవుంది. దీంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. 
 
ముఖ్యంగా, నగర శివారు ప్రాంతాల్లోనూ రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. అత్యధికంగా చెన్నై చోళవరంలో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుమ్మడిపూండిలో 18 సెంటీమీటర్లు, ఎన్నూర్‌లో 17 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
 
భారీ వర్షాలకు చెన్నైలోని పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. ఎడతెరపిలేకుండా వానలు కురుస్తుండంతో రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. ఏ క్షణమైన గేట్లను ఎత్తివేసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
 
కాగా, చెన్నై తిరువళ్లూర్‌, చెంగల్‌పట్టు, కాంచీపురం జిల్లాల్లో గురువారం సాయంత్రం వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం ఉత్తర చెన్నై, శ్రీహరి కోటల మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఈ సమయంలో గంటకు 40 వేగంతో గాలులు వీస్తాయని అధికారులు సూచించారు. దీంతో మహాబలిపురంలోని పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం మూసివేసింది. భారీవర్షాల నేపథ్యంలో చెన్నై, నాగపట్నం, పుదుచ్చేరి కరైకాల్‌తోపాటు ఏడు ఓడరేవుల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. అలాగే, చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.