బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (10:15 IST)

దంచికొట్టిన వర్షం : సీఎం సభా ప్రాంగణంలోకి వర్షపునీరు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. ఈ పథకాన్ని పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించేందుకు రాష్ట్ర సీఎం కేసీఆర్‌ సోమవారం హుజూరాబాద్‌కు వెళ్లనున్నారు. అయితే హుజూరాబాద్‌ మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. 
 
దీంతో రాత్రి కురిసిన భారీ వర్షానికి సీఎం సభా ప్రాంగణంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. రోడ్లపై నీరు చేరి గుంతల మయంగా మారింది. కంకరతో గుంతలను అధికారులు పూడ్చివేయిస్తున్నారు. బురదమయమైన మట్టి రోడ్డుపై కంకర వేసి లెవలింగ్ చేయిస్తున్నారు.
 
ఈ పథకం ప్రారంభోత్సవంలో లక్ష మందికి పాల్గొనేలా సభ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. స్టేజీపై 250మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రెయిన్‌ఫ్రూఫ్‌ టెంట్లతో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు. హుజూరాబాద్‌ - జమ్మికుంట రోడ్డు పక్కనున్న శాలపల్లి - ఇంద్రానగర్‌లో 20 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.
 
అయితే సీఎం సభ ఏర్పాటు చేసిన ప్రాంతంతో ఓ సెంటిమెంట్ కూడా ముడిపడి ఉంది. 2018 మేలో ఇదే ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని సైతం ఇదే శాలపల్లి వేదికగా ప్రారంభించడం గమనార్హం. ఇప్పటివరకూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాల కంటే ఈ పథకం ఆది నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 
 
అందుకే.. సభను అనుకున్నదాని కంటే ఎక్కువరెట్లు విజయవంతం చేసేలా సర్వం సిద్ధం చేశారు. కానీ, ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో అధికారుల శ్రమ వర్షపునీటిలో కొట్టుకునిపోయింది.