ఛత్తీస్‌గఢ్ తొలి సీఎం అజిత్ జోగి ఇకలేరు.. ఐఏఎస్ నుంచి సీఎం వరకు...
ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 74 యేళ్లు. అజిత్ జోగి మరణవార్తలను ఆయన కుమారుడు అమిత్ జోగి తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. తన తండ్రి అజిత్ జోగీ రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూసినట్టు అందులో పేర్కొంటూ, ఓ ఫోటోనను కూడా పోస్ట్ చేశారు.
గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన అజిత్ జోగికి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్ సమస్య ఉత్పన్నమైంది. మూడు వారాలుగా ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. అయితే, శుక్రవారం ఆయన చనిపోయినట్టు ధృవీకరించారు. కాగా, 20 ఏళ్ల వయసున్న చత్తీస్‌గఢ్ రాష్ట్రం కుటుంబ పెద్దను కోల్పోయిందని అమిత్ జోగి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తానే కాకుండా, రాష్ట్ర ప్రజలందరూ ఒక తండ్రిని కోల్పోయారని చెప్పుకొచ్చారు.
కాగా, ఐఏఎస్ అధికారి నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి అజిత్ జోగి ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో కీలక నేతగా కూడా వ్యవహరించారు. ఆ క్రమంలో గత 2000వ సంవత్సరంలో అవతరించిన ఛత్తీస్‌గఢ్ తొలి సీఎంగా అజిత్ జోగి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన ఆయన... జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ అనే సొంత పార్టీని స్థాపించారు.
1946 ఏప్రిల్ 29వ తేదీన బిలాస్‌పూర్‌లో అజిత్ జోగి జన్మించారు. భోపాల్‌లోని మౌలానా అజాద్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. భోపాల్, ఇండోర్ జిల్లాలకు కలెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తించారు.
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. గతంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు. వెన్నుపూస దెబ్బతినడంతో అప్పటి నుంచి చక్రాల కుర్చీకే పరిమితమయ్యారు. ఆ కుర్చీలోనే ఉంటూ ఛత్తీస్‌గఢ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. తమ సొంత పార్టీని కూడా సమర్థవంతంగా నడిపారు.