ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (19:48 IST)

కర్ణాటకలో కాంగ్రెస్ 'పకోడాల నిరసన'

బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్ణాటకలోని శివమొగ్గలో శనివారంనాడు 'పకోడా నిరసన' కార్యక్రమం నిర్వహించారు.

శివప్ప నాయక సర్కిల్‌లో వేడివేడి పకోడాలు తయారు చేస్తూ ప్రజలకు వాటిని పంచుతూ వీరంతా నిరసన తెలిపారు. దేశంలో అంతకంతకూ పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆర్థిక మందగమన పరిస్థితులకు వ్యతిరేకంగా వీరంతా నినాదాలు చేశారు. దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి, పేదరికంలోకి జారుకుంటున్నారంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను వారు ఎండగట్టారు.

'ఆర్థిక వ్యవస్థ దిగజారుడు పేదరికానికి దారి తీస్తోంది', 'ఆర్థిక మందగమనంతో ఏడు కోట్ల ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది', 'వరదల అనంతర సహాయక చర్చల్లో బీజేపీ వైఫల్యం చెందింది' అనే నినాదాలతో కూడిన ప్లకార్డులను వీరు ప్రదర్శించారు.

కాగా, వరద బాధిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ నేత బీఆర్ జయంత్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.