శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (19:51 IST)

ఎన్సీపీ-కాంగ్రెస్ చెరో సగం సీట్లు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై అవగాహన కుదిరింది. పొత్తులో భాగంగా ఎన్‌సీపీ, కాంగ్రెస్ చెరో 125 సీట్లలో పోటీ చేస్తాయని, తక్కిన 38 సీట్లలో భాగస్వామ్య పార్టీలు పోటీలో ఉంటాయని మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ తెలిపారు.
 
ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడానికి ముందు చవాన్ మీడియాతో మాట్లాడుతూ, సీట్ల పంపకాల ఫార్ములాపై వంచిత్ బహుజన్ అఘాడి (ప్రకాష్ అంబేడ్కర్), స్వాభిమాన్ షెట్కారి సంఘటన, సమాజ్‌వాదీ పార్టీలో చర్చలు సాగిస్తున్నట్టు చెప్పారు.

వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరుతుండటంపై మాట్లాడుతూ, ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు గుండెకాయ వంటివని, అయితే ఇప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. దేశాన్ని ఏకపార్టీ పాలనలోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
 
కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్సీపీకి చెందిన పలువురు ప్రముఖ నేతలు, మాజీ మంత్రులు బీజేపీలోకి, శివసేనలోకి చేరుతుండటం ప్రతిపక్ష పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది.

అయితే, పిరికివాళ్లు మాత్రమే పార్టీని వీడుతున్నారని, వీరికి ప్రజలే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని తాజా వలసలపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మండిపడ్డారు.