ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ షరతు ... యేడాదికి రూ.50 వేలు ఇవ్వాల్సిందే..
సొంత పార్టీకి చెందిన ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ ఓ షరతు విధించింది. ప్రతి యేడాది రూ.50 వేల చొప్పున పార్టీకి విరాళాలు ఇవ్వాల్సిదేనంటూ కండిషన్ పెట్టింది. అంతేకాకుండా, పార్టీపై అభిమానం ఉన్న కనీసం ఇద్దరి నుంచి యేటా రూ.4 వేలు విరాళంగా సేకరించాలని కోరింది. అలాగే, ఖర్చు తగ్గించుకోవాలని పార్టీ సభ్యులకు సూచించింది.
దేశంలో 135 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నిధులు లేక ఇబ్బంది పడుతుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలు బాగా తగ్గాయి. 2018-19లో రూ.383 కోట్ల మేర ఎన్నికల బాండ్లు రాగా.. 2019-20లో రూ.318 కోట్లు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పార్టీ నిధుల సేకరణ పొదుపు చర్యలపై దృష్టి సారించింది. పార్టీ కోశాధికారి పవన్ బన్సాల్ పార్టీ కార్యవర్గ సభ్యులకు లేఖల ద్వారా ఈ విషయం తెలియజేశారు.
పార్టీలోని ప్రతి సభ్యుడు తమ ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. కొందరు ఎంపీలు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్నారు. వారికి ప్రభుత్వం నుంచి లభించే విమాన సౌకర్యాలను ఉపయోగించుకోవాలని సూచించింది.
ఇకపై కార్యదర్శులుగా ఉన్నవారికి 14,000 కి.మీ లోపు రైలులోనే ప్రయాణించాల్సి ఉంటుందని తెలిపారు. అది దాటితే తక్కువ శ్రేణి విమాన చార్జీలు చెల్లిస్తామని వెల్లడించారు. అది కూడా నెలకు రెండు సార్లు.. విమాన చార్జీలు రైలు టికెట్ కన్నా తక్కువ ఉంటేనే చెల్లిస్తామన్నారు.
అలాగే, ఇకమీద ప్రతీ ఎంపీ ఏటా రూ.50,000 విరాళం ఇవ్వాలని అంతే కాకుండా పార్టీపై అభిమానం ఉన్న కనీసం ఇద్దరి వద్ద నుంచి ఏటా రూ.4,000 విరాళం సేకరించాలని సూచించింది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ విరాళాలు ఏడాదిలో రూ.1,450కోట్ల నుంచి రూ.2,555 కోట్లకు పెరిగాయి.