గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 ఆగస్టు 2020 (11:11 IST)

అలా చేయకుంటే మరో 50 యేళ్లు ప్రతిపక్షంలోనే : ఆజాద్ సంచలన కామెంట్స్

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యక్ష ఎన్నికల విధానంలో పార్టీ అధినేతను ఎన్నుకోవాలని సూచించారు. అలాకాకుండా నేరుగా నియమించే వ్యక్తిని ఎన్నుకుంటే ఆయనకు ఒక్కశాతం కూడా మద్దతు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. 
 
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష సంక్షోభం నెలకొంది. అధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలోనూ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోలేక పోయారు. దీంతో మరో ఆర్నెల్లపాటు సోనియానే అధ్యక్ష బాధ్యతలు నిర్వహించనున్నారు. 
 
స్పష్టంగా చెప్పాలంటే వందేళ్ళ సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరో ఒకరిని అధ్యక్షుడిగా నియమించడం కంటే ఎన్నికల ద్వారానే అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు. అలా ఎన్నికైన వ్యక్తులను తొలగించడం సాధ్యం కాదన్నారు. 
 
అలాకాకుండా, నేరుగా నియమించే వ్యక్తికి ఒక్కశాతం మద్దతు కూడా ఉండకపోవచ్చన్నారు. ఎన్నికల ద్వారా అధ్యక్షుడిని ఎన్నుకోకుంటే పార్టీ మరో 5 దశాబ్దాలపాటు ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
కాంగ్రెస్ అధ్యక్ష పదవితోపాటు రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి అధ్యక్షుల వరకు అన్ని కీలక పదవులను ఎన్నికల ద్వారానే భర్తీ చేయాలని ఆజాద్ సూచించారు. ఈ విధానాన్ని ఎవరైనా వ్యతిరేకించారంటే దానర్థం వారు ఓటమికి భయపడుతున్నారనే అర్థమన్నారు.