శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

కాంగ్రెస్‌కు సంకటం.. కమల వికాసం

బాబ్రీ మసీదు-రామ మందిరం వివాదాన్ని సమకాలీన దేశ రాజకీయాల నుంచి విడదీయలేం. స్వాతంత్య్రానికి పూర్వం స్థానికాంశంగానే ఉన్న ఈ వివాదం.. స్వాతంత్య్రానంతరం ముఖ్యంగా 1980ల తర్వాత భారత రాజకీయాల్లో కేంద్ర బిందువై కూర్చుంది.

రాజకీయ పార్టీల భవితవ్యాన్ని శాసించడం ప్రారంభించింది. ఇందులో ఎక్కువగా సంకట స్థితిని ఎదుర్కొన్నది కాంగ్రెస్‌ పార్టీ అయితే.. భాజపా ఎదుగుదలకు ఇదే బ్రహ్మాస్త్రమైంది. కమండల్‌(హిందూత్వ రాజకీయాలు) అస్త్రంతో భాజపా, మండల్‌(ఓబీసీలకు రిజర్వేషన్లు) నినాదంతో సోషలిస్టులు పుంజుకున్నారు. 
 
అయోధ్య వివాదం 1984 తర్వాత దేశ రాజకీయాలపై ఎక్కువ ప్రభావం చూపుతూ వచ్చినప్పటికీ.. దీని మూలాలు మాత్రం 1949లోనే కనిపించాయి. వివాదాస్పద బాబ్రీ మసీదు కట్టడం మధ్యలో 1949లో రాముడు, సీతాదేవి విగ్రహాలు వెలిశాయి.

ఈ పరిణామాల్ని అప్పటి ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి గోవింద్‌ వల్లభ్‌ పంత్‌(కాంగ్రెస్‌) చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణల్ని మూటగట్టుకున్నారు. హిందూత్వ విషయంలో పంత్‌ సానుకూలంగా మెలిగారనడానికి ప్రధాని నెహ్రూతో ఆయన జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలే రుజువనేది పరిశీలకుల అభిప్రాయం. అయోధ్యలో ఏదో జరుగుతోందని అనుమానించిన ప్రధాని నెహ్రూ 1950 ఏప్రిల్‌ 17వ తేదీన పంత్‌కు ఓ లేఖ రాశారు.

‘‘మత కోణంలో చూసినట్లయితే ఉత్తరప్రదేశ్‌లో వాతావరణం బాగా దెబ్బతింటోందని చాన్నాళ్లుగా నేననుకుంటూ ఉన్నా. ఇదో పరాయి భూభాగంగా మారుతోందన్న అనుమానం వేస్తోంది. కేవలం రాజకీయాల కోసం- ఈ జాడ్యం విషయంలో చాలా ఉదాశీనంగా వ్యవహరిస్తున్నామని నాకు అనిపిస్తోంది’’ అంటూ పరోక్షంగా పంత్‌కు హెచ్చరికలు చేశారు.

కాంగ్రెస్‌ పార్టీలోనే ఆచార్య నరేంద్రదేవ్‌ లాంటి సోషలిస్టుల్ని ఎదుర్కొని.. తన రాజకీయ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం మతతత్వం విషయంలో పంత్‌ మెతకగా వ్యవహరించారని చరిత్రకారులు చెబుతారు.

1949లో మసీదులో విగ్రహాలు వెలియడం, ఆ తర్వాత మసీదు ప్రధాన ద్వారాన్ని మూసేయాలని కోర్టు ఆదేశించడం, ముస్లింలకు ప్రవేశాన్ని నిషేధించడం, దీన్నో వివాదాస్పద భూభాగంగా ప్రకటించడం.. ఇలాంటివన్నీ తదనంతర కాలంలో కాంగ్రెస్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపడం ప్రారంభించాయి.

1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన తర్వాత పరిస్థితులు మరింతగా మారాయి. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో- తన ఓటు బ్యాంకును విస్తరించుకోవడం కోసం కాంగ్రెస్‌ పార్టీ మతం కార్డును సున్నితంగా ప్రయోగించింది.

1984లో రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత- అటు హిందువులు, ఇటు ముస్లింలలోని మతతత్వవాదుల్ని మచ్చికచేసుకునే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. షాబానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిరాజనడం ద్వారా ప్రభుత్వం తొలుత ముస్లింలకు అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఇది మెజారిటీ హిందువుల్లో ఆగ్రహానికి కారణమైంది.