శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

ఎన్ఎంఎంఎల్ నుంచి కాంగ్రెస్ సీనియర్లకు ఉద్వాసన

కాంగ్రెస్‌ పార్టీకి కేంద్రం షాకిచ్చింది. నెహ్రూ మెమోరియల్ మ్యూజియమ్ అండ్ లైబ్రరీ సొసైటీ నుంచి కాంగ్రెస్ సీనియర్లకు ఉద్వాసన పలికింది.

ఎన్ఎంఎంఎల్ సొసైటీ నుంచి మల్లికార్జున ఖర్గే, జైరాం రమేష్, కరణ్ సింగ్‌లను తొలగించింది. వారి స్థానంలో జర్నలిస్టు రజత్ శర్మ, గేయరచయిత ప్రసూన్ జోషిలకు చోటు కల్పించింది. ముగ్గురు కాంగ్రెస్ నేతలను తొలగించడంతో ఎన్ఎంఎంఎల్ సొసైటీలో ప్రస్తుతం ఒకే ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఉన్నారు. ఎన్ఎంఎంఎల్ సొసైటీని కేంద్రం పునర్ వ్యవస్థీకరించింది. సొసైటీ అధ్యక్షుడిగా ప్రధాని మోదీ, ఉపాధ్యక్షునిగా రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఉంటారు.

కేంద్రమంత్రులు అమిత్‌షా, సీతారామన్, రమేష్ పొఖ్రియాల్, ప్రకాష్ జవదేకర్, ప్రహ్లాద్ పటేల్‌లో ప్యానెల్‌లో ఉంటారు. బీజేపీ నేత వినయ్ సహస్రబుద్ధే, ప్రసార భారతి చీఫ్ ఎ.సూర్యప్రకాష్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

ప్రస్తుతం ఎన్ఎంఎంఎల్ డైరెక్టర్‌గా ఉన్న శక్తి సిన్హా అక్టోబర్ 4న పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సాంస్కృతిక శాఖ మాజీ కార్యదర్శి రాఘవేంద్ర సింగ్ వచ్చారు. 1964లో ఢిల్లీలోని తీన్‌మూర్తి హౌస్ కాంప్లెక్‌లో నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీని ప్రారంభించారు.

భారత స్వాంతత్ర్యోద్యమ చరిత్రను పరిరక్షించే ఉద్దేశంతో ఈ మ్యూజియాన్ని నెలకొల్పారు. ఈ సొసైటీ, కేంద్ర సాంస్కృతిక శాఖ కింద అటానమస్ సంస్థగా ఉంది. దశాబ్దాలుగా ఈ సొసైటీని కాంగ్రెస్ నాయకులే లీడ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మోదీ సర్కారు, నెహ్రూ మ్యూజియంలో భారీ మార్పులు చేపట్టాలని సంకల్పించింది.