గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 6 నవంబరు 2021 (20:30 IST)

వాయు కాలుష్యంతో కరోనా తీవ్రత అధికం: ఎయిమ్స్‌ డైరెక్టర్‌

వాయు కాలుష్యంతో కరోనా తీవ్రత అధికమవుతుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు. ''కాలుష్యం కారణంగా ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమస్యలు వస్తాయి.ఊపిరితిత్తుల సమస్య తీవ్రం అవుతుంది. కరోనా సైతం ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. 
 
ఈ నేపథ్యంలో కాలుష్యం వల్ల కరోనా బాధితుల పరిస్థితి విషమించే అవకాశం ఉంది. కొన్నిసార్లు మరణానికి కూడా దారితీయొచ్చు. మాస్కులు ధరించాల్సిందే. వీలైతే ఎన్‌95 మాస్కులు వాడాలి. 
 
కాలుష్యంతో పాటు కరోనా నుంచి కూడా అవి మనల్ని కాపాడతాయి'' అని గులేరియా సూచించారు. దీపావళి సందర్భంగా దిల్లీలో పేల్చిన బాణసంచా కారణంగా అక్కడ రికార్డుస్థాయిలో వాయు కాలుష్యం నమోదైంది. 
 
శనివారం నాటికి పరిస్థితి కాస్త చక్కబడ్డా కాలుష్యం ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉందని అధికారులు తెలిపారు. కాలుష్యం.. కరోనా మధ్య ఉన్న సంబంధాన్ని గులేరియా రెండు విధాలుగా వివరించారు. 
 
కాలుష్యం ఎక్కువ ఉన్న గాలిలో వైరస్ ఎక్కువ కాలం ఉంటుందని నివేదికలు చెబుతున్నాయన్నారు. మరోవైపు వైరస్‌ సోకిన వారి ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు 2003 సార్స్‌ మహమ్మారి వ్యాప్తి సందర్భంగా గుర్తించామన్నారు. 
 
ఈ నేపథ్యంలో కాలుష్యం, కరోనా రెండూ కలిస్తే మరణాలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని సూచించారు.