గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (19:59 IST)

తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ.. ఢిల్లీలో కోవిడ్ కౌంట్ డౌన్

తమిళనాడులో కరోనా వైరస్‌ ప్రజలను పట్టిపీడిస్తోంది. సోమవారం నుంచి మంగళవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,063 కరోనా కేసులు నమోదు కాగా 108 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,68,285కి, మరణాల సంఖ్య 4,349కి చేరింది. 
 
మంగళవారం 6,501 మంది కరోనా రోగులు డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో తమిళనాడులో ఇప్పటి వరకు కరోనా నుంచి 2,08,784 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా సోకిన వారిలో 55,152 మంది చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది.
 
మరోవైపు ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత వారం రోజులుగా రాజధానిలో వెయ్యి లోపు కేసులు మాత్రమే నమోదు అవుతుండడంతో పాలకులతో పాటు ప్రజలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. గాలిలో వైరస్‌ క్షీణిస్తోందని పలువురు వైద్య నిపుణులు వాపోతున్నారు.
 
ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 674 కరోనా కేసులు నమోదు కాగా 972 మంది డిశ్చార్జి అయ్యారు. కేవలం 12 మంది మాత్రమే ఇవాళ వైరస్‌ బారిన పడి మృతిచెందారు. మొత్తం కేసుల సంఖ్య 1,39,156కు చేరగా అందులో 1,25,226 మంది వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 4033 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం తెలిపింది.