శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 మార్చి 2021 (11:25 IST)

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : కాంగ్రెస్ పార్టీకి 25 సీట్లిచ్చిన డీఎంకే

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల ఆరో తేదీన జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం రెండు ప్రధాన కూటమిల మధ్య సీట్ల పంపిణీ కొనసాగుతోంది. ఇందులోభాగంగా, తమ మిత్రపక్షమైన కాంగ్రెస్ కు 25 సీట్లను డీఎంకే కేటాయించింది. అలాగే, ఓ రాజ్యసభ సీటును కూడా ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించింది. 
 
ఇదే అంశంపై డీఎంకే నేత ఒకరు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తమకు 30 సీట్లు కావాలని పట్టుబట్టిందని, తొలుత 24 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు అంగీకరించిన డీఎంకే అధిష్టానం, ఆపై చర్చల తరువాత మరో సీటును పెంచిందని వెల్లడించారు. 
 
శనివారం సాయంత్రం ఈ మేరకు ఒప్పందం కుదిరిందని, 25 స్థానాలు తీసుకుని కలసికట్టుగా ముందడుగు వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించిందని ఆ పార్టీ నేత దినేశ్ గుండూరావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఒప్పందంపై ఇరు పార్టీలూ సంతకాలు చేస్తాయని తెలిపారు.
 
ఈ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ కేఎస్ అళగిరి, ప్రస్తుతం రాష్ట్రంలో డీఎంకే హవా నడుస్తోందని, దీంతో బేరసారాల విషయంలో తాము పట్టుబట్టే అవకాశాలు తగ్గిపోయాయని అన్నారు. ఇరు పార్టీలూ సీట్ల షేరింగ్ విషయంలో పలుమార్లు చర్చలు జరిపాయని ఆయన అన్నారు. 
 
2016 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 41 స్థానాలను డీఎంకే కేటాయించింది. ఏప్రిల్ 6న ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడతాయి.