మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (14:03 IST)

18 సీట్లకు మించి ఇవ్వం... ఉంటే ఉండండి.. పోతే పోండి! కాంగ్రెస్‌కు డీఎంకే అల్టిమేటం

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి వచ్చే నెల ఆరో తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తమతమ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయనున్నారు. అయితే, డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇపుడు అగమ్య గోచరంగా మారింది. తమకు 30 సీట్లు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటగా, 18 సీట్లకు మించి ఇవ్వలేమంటూ డీఎంకే తేల్చి చెప్పింది. దీంతో కూటమిలో కొనసాగాలా లేదా అనే అంశంపై కాంగ్రెస్ రాష్ట్ర నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. 
 
ఈ నేపథ్యం రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు గురువారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. కూటమిలో కొనసాగాలా? వద్దా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి 18 కంటే ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు డీఎంకే సిద్ధంగా లేదని, అలాగే కూటమిలో మిగతా పార్టీలకు కేవలం మూడు నాలుగు సీట్లు ఇస్తామనడంతో ఆయా పార్టీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 
 
డీఎంకేను ఒప్పించడంలో విఫలమైతే కమల్‌ హసన్‌ సారథ్యంలోని "మక్కల్‌ నీది మయ్యం''తో కలిసి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై తమిళనాడు ఏఐసీసీ ఇన్‌చార్జి వివరణ కోరగా స్పందించేందుకు నిరాకరించారు. అయితే సీట్ల పంపకంపై న్యాయంగా, పరస్పర గౌరవంగా ఉండాలన్నారు. అలాగే కూటమిలోని వైగోకు చెందిన ఎండీఎంకే సీట్ల పంపకంపై డీఎంకే తర్వలోనే తేల్చనున్నట్లు తెలుస్తోంది. 
 
ఇప్పటికే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్), మణితనేయ మక్కల్ కచ్చి (ఎంఎంకే) సీట్లు కేటాయించింది. ఐయూఎంఎల్‌కు మూడు, ఎంఎంకేకు రెండు అసెంబ్లీ స్థానాలను డీఎంకే ఇచ్చింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 6న ఒకే దశలో నిర్వహించనుండగా.. మే 2న ఫలితాలు ప్రకటించనున్నారు.