శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 21 ఫిబ్రవరి 2021 (17:36 IST)

పుదుచ్చేరి సర్కారుకు మరో ఎదురుదెబ్బ .. డీఎంకే ఎమ్మెల్యే రాజీనామా

రాష్ట్ర హోదా కలిగిన పుదుచ్చేరి రాజకీయాలు గంటగంటకూ మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వ బలపరీక్షకు మరో 24 గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మిత్రపక్షమైన డీఎంకేకు చెందిన ఒక ఎమ్మెల్యే ఒకరు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు రాజీనామా చేశారు. 
 
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే లక్ష్మినారాయణన్ కాగా,  మరొకరు డీఎంకే ఎమ్మెల్యే వెంకటేశన్. వీరిద్దరూ తమతమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసారు.
 
రాజీనామా విషయంపై లక్ష్మీనారాయణన్ మాట్లాడుతూ, తాను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, అయినా సరే పార్టీలో గుర్తింపు లేదని, అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు కాంగ్రెస్‌కు కూడా గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించారు. వీరిద్దరి రాజీనామాతో ప్రభుత్వ బలం 12 కు పడిపోయింది. 
 
‘నేను సీనియర్ ఎమ్మెల్యేను. అయినా సరే మంత్రి పదవి ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. నా కార్యకర్తలతో చర్చించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తాను.’’ అని ఎమ్మెల్యే లక్ష్మినారాయణ ప్రకటించారు. 
 
అయితే ఇప్పటికే ఆయన్ను బీజేపీ, ఎన్నార్ కాంగ్రెస్ ఇద్దరూ కలిశారని, అయితే ఆయన మాత్రం ఎవరికీ హామీ ఇవ్వలేదని ఆయన వర్గీయులు పేర్కొంటున్నారు.
 
మరోవైపు, ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామా అందిందని స్పీకర్ వీపీ శివకొలుందు ప్రకటించారు. ఈ విషయాన్ని సీఎం నారాయణ స్వామితో పాటు అసెంబ్లీ కార్యదర్శికి కూడా తెలిపానని, వారి రాజీనామాలను పరిశీలిస్తున్నామని స్పీకర్ ప్రకటించారు. 
 
మరోవైపు సోమవారం నారాయణ స్వామి ప్రభుత్వం బలపరీక్షను ఎదుర్కోబోతోంది. సాయంత్రం 5 గంటల వరకూ ఆయన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.