ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 మార్చి 2024 (22:42 IST)

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్: దేశంలో సిట్టింగ్ సీఎం అరెస్ట్ ఇదే తొలిసారి

kejriwal
ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కుట్రదారుడని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆరోపిస్తూ.. గురువారం ఆయనను అరెస్టు చేసింది. అరవింద్ కేజ్రీవాల్ తొమ్మిది సార్లు ఈడీ సమన్లను పట్టించుకోలేదు. 
 
ప్రస్తుతం రద్దు చేసిన మద్యం పాలసీ కేసును రూపొందించే సమయంలో బీఆర్‌ఎస్ నాయకురాలు కే కవిత కేజ్రీవాల్, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లతో కలిసి కుట్ర పన్నారని ఈడీ ప్రెస్ నోట్‌లో పేర్కొంది. మద్యం లాబీకి ప్రయోజనం చేకూర్చే విధానాన్ని రూపొందించారని ఆరోపణలు వున్నాయి. ఈ క్రమంలో సౌత్ లాబీలో మొదటి నిందితుడిగా ఉన్న రాఘవ్ మాగుంట ఇప్పుడు సాక్షిగా మారాడు. 
 
కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసినా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయరని తెలిపారు. ఎన్నికలకు ముందు ఆయన గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆయనను అరెస్ట్ చేస్తే జైలు నుంచి ఢిల్లీని పరిపాలన చేస్తారని సాయంత్రమే చెప్పారు.
 
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్రంగా స్పందించారు. కేజ్రీవాల్ అరెస్ట్ వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు.