సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 మే 2023 (11:36 IST)

ప్లేటు భోజనం ఆర్డరిస్తే మరో భోజనం ఫ్రీ.. సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కిన బ్యాంకు ఉద్యోగిని

cyber attack
ఒక ప్లేటు భోజనం ఆర్డరిస్తే మరో భోజనం ఫ్రీ (ఉచిత థాలీ) అనే ఆఫర్‌కు ఆకర్షితులైన ఓ బ్యాంకు ఉద్యోగిని సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి ఏకంగా రూ.90 వేలును పోగొట్టుకున్నారు. ఈ ఘటన నైరుతి ఢిల్లీలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నైరుతి ఢిల్లీ ప్రాంతానికి చెందిన సవితాశర్మ (40) అనే మహిళ ఓ బ్యాంకులో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నారు. 'ఒక థాలీ (భోజనం ప్లేటు) కొంటే.. మరో థాలీ ఉచితం. మా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి' అనే ఆఫర్‌ను సవితకు ఆమె బంధువు ఒకరి చెప్పారు. దీంతో ఆ సైట్‌లోకి వెళ్లి ఇచ్చిన నంబరుకు కాల్‌ చేయగా, ఆ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 
 
కొంతసేపటి తర్వాత సవితా శర్మకు ఫోన్ చేసిన కాలర్.. 'సాగర్‌ రత్న' (ప్రముఖ చైన్‌ రెస్టారెంటు) ఆఫర్‌ గురించి వివరించాడు. ఆ తర్వాత ఆమె మొబైల్ నంబరుకు ఓ లింక్‌ పంపి, డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించాడు. యాప్‌కు సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పంపాడు. ఆఫర్‌ ఉపయోగించుకోవాలనుకుంటే ముందుగా యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. ఇది నిజమేనని చెప్పిన సవితా... ఆ కాలర్ చెప్పినట్టుగానే అన్నీ చేసింది. 
 
ఆ తర్వాత ఆమెకు మొబైల్ ఫోనుపై నియంత్రణ లేకుండా పోయింది. మొబైల్ ఫోనును తమ చేతుల్లోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు... రెండు దఫాలుగా రూ.40, రూ.50 వేలు చొప్పున లాగేశారు. ఈ డబ్బులను ఆమె క్రెడిట్ కార్డు నుంచి ఆమె పేటీఎం ఖాతాకు మళ్లించి, అక్కడ నుంచి వారు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకోవడం గమనార్హం. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.