దేశ రాజధాని ఢిల్లీకి చెత్త రికార్డు... కాలుష్యం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ స్థానమెంత?
మన దేశ రాజధాని ఢిల్లీ మరోమారు చెత్త రికార్డును సొంతచేసుకుంది. ప్రపంచ దేశాల రాజధానుల్లో అత్యంత కాలుష్య నగరంగా పేరుగడించింది. పైగా, ప్రపంచంలో కాలుష్యం అధికంగా ఉన్న దేశాల్లో భారత్‌కు మూడో స్థానం దక్కింది. గడిచిన ఐదేళ్లలో నాలుగోసారి కాలుష్యంలో ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఇక మనదేశానికి వస్తే ప్రపంచంలో మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. 2022లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత్.. ఇపుడు మూడో స్థానికి ఎగబాకింది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌కు చెందిన ఐక్యూఎయిర్ కంపెనీ తాజాగా ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో ఆయా దేశాల ర్యాంకులను బహిర్గతం చేసింది. గాలిలో పీఎం 2.5 స్థాయుల ఆధారంగా ఐక్యూఎయిర్ ఈ జాబితాను రూపొందించింది.
ఢిల్లీలో పీఎం 2.5 స్థాయిలు 2022లో ప్రతి క్యూబిక్ మీటర్‌కు 89.1 మైక్రోగ్రాములు ఉండగా, 2023 నాటికి అది 92.7 మైక్రోగ్రాములకు చేరిందని ఐక్యూఎయిర్ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్ ఏరియాలో ఐటీ నగరం బెగుసరాయ్‌లోనే కాలుష్యం అధికమని అక్కడ సగటున ప్రతి క్యూబిక్ మీటర్‌కు పీఎం 2.5 స్థాయిలు 118.9 మైక్రో గ్రాములుగా ఉందని తెలిపింది. 2022లో విడుదల చేసిన కాలుష్య నగరాల జాబితాలో బెగుసరాయ్ పేరే లేదు. కానీ, రెండేళ్ళలో ఈ నగరం అత్యధిక కాలుష్య నగరంగా గుర్తింపుపొందింది. మొత్తం 134 దేశాల్లో ఈ సర్వే చేపట్టగా, మూడో ర్యాంకులో భారత్ నిలిచింది. మన పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.