సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 అక్టోబరు 2021 (15:14 IST)

డెంటిస్ట్‌ ప్రేమ పెళ్లి.. మనస్తాపంతో తల్లిదండ్రులు ఆత్మహత్య

డెంటిస్ట్‌గా పనిచేస్తున్న కూతురు ప్రేమ పెళ్ళి చేసుకోవటంతో మనస్తాపం చెందిన తల్లితండ్రులు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట సమీపంలోని మాంబేడు గ్రామంలో నివసించే తామరై సెల్వన్ (60) సరళ (55) అనే దంపతులకు అర్చన(28) అనే కుమార్తె ఉంది. ఆమె దంత వైద్యురాలిగా చెన్నైలోని వేప్పేరిలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. వారం రోజుల క్రితం ఆమె పెద్దల అభీష్టానికి విరుధ్ధంగా ఒక 35 ఏళ్ల వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది.
 
అప్పటికే ఆ వ్యక్తికి రెండు సార్లు పెళ్లై, పిల్లలు ఉన్నారన్న సంగతి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ వారం రోజుల నుంచి కుమార్తె ఇంటికి రాకపోయే సరికి వారు బాధకు లోనయ్యారు.
 
ఈ నేపథ్యంలో గురువారం ఉదయం తామరై సెల్వన్ బజారుకువెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య సరళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనపడటంతో తీవ్ర దిగ్రాంతికి గురయ్యాడు. భార్య ఆత్మహత్య చేసుకోవటంతో కలత చెంది తామరై సెల్వన్ కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఊత్తుకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.