1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 మే 2024 (09:35 IST)

యువకుడి ఛాతిలో దిగిన బాణం - ప్రాణాలు కాపాడిన నిమ్స్ వైద్యులు!!

boy - arrow
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ గిరిజన యువకుడి ఛాతిలోకి బాణం దిగింది. వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆ బాలుడి ప్రాణాలను రక్షించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఛత్తీస్‌గడ్ బీజాపూర్ జిల్లా ఊనూర్ ప్రాంతానికి చెందిన సోది నంద (17) అనే గుత్తికోయ యువకుడు గురువారం అడవిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో అతడికి ప్రమాదవశాత్తూ ఛాతిలో బాణం దిగింది. వెంటనే భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎంకు అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు. 
 
వైద్యులు తొలుత యువకుడికి సీటీ స్కాన్ చేశారు. ఊపరితిత్తుల పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్టు గుర్తించారు. అప్పటికే భారీగా రక్తస్రావం కావడంతో యువకుడుకి రక్తం ఎక్కిస్తూనే ఆపరేషన్ చేసి బాణాన్ని తొలగించారు. బాణం దిగిన చోట రక్తం గడ్డకట్టడంతో అధిక రక్తస్రావం కాలేదని, దీంతో యువకుడి ప్రాణాలు నిలిచాయని వైద్యులు తెలిపారు. యువకుడు బలవంతంగా బాణం బయటకు తీసి ఉంటే రక్తస్రావమై ప్రాణాలు పోయి ఉండేవని తెలిపారు. ఆపరేషన్ ఉచితంగా చేశామని వారు తెలిపారు. కాగా ఆపరేషన్ చేసిన డాక్టర్ అమరేశ్వర రావు వైద్య బృందాన్ని నిమ్స్ డైరెక్టర్ అభినందించారు.