1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 సెప్టెంబరు 2021 (13:31 IST)

హనీట్రాప్ కేసులో విస్తుపోయే నిజాలు... ఐదుగురు డీఆర్డీవో సిబ్బంది అరెస్టు

ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా చాందీపూర్‌లో డీఆర్‌డీవో రహస్యాల లీకు ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఐదుగురు డీఆర్డీవో సిబ్బంది ఒక మహిళకు రహస్య సమాచారం పంపించేవారని తెలిసింది. పోలీస్ కస్టడీలో ఉన్న ఈ ఐదుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఎస్ఏ), ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కటక్ క్రైం బ్రాంచ్ అధికారులు విచారిస్తున్నారు. 
 
ఇదే అంశంపై క్రైం బ్రాంచ్ ఏడీజీ సంజీబ్ పండా విలేకరులతో మాట్లాడుతూ.. ఓ మహిళ ఫోన్, చాటింగ్ ద్వారా ఈ ఐదుగురికి దగ్గరైందన్నారు. ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో పరిచయం చేసుకొని వీడియోకాల్, ఫేస్‌బుక్, వాట్సప్‌లో సంభాషించినట్లు, వీరిలో కొంతమందిని పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు చెప్పారు. 
 
బ్రిటన్‌లో ఉంటున్నానని ఒకరితో, రాజస్థాన్‌లో అని మరొకరితో చెప్పి మోసగించినట్లు వెల్లడించారు. రక్షణశాఖలోను, నర్సుగాను పనిచేస్తున్నాని ఇలా పలు రకాలుగా నమ్మించి వారిని హనీ ట్రాప్లోకి లాగినట్లు వివరించారు. వీరిలో ఒకరికి దుబాయ్ నుంచి రూ.35 వేలు పంపినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. 
 
యూకేకు చెందిన ఫోన్ నంబరు ద్వారా ఆ మహిళ మాట్లాడినట్లు చెప్పారు. ఆ వివరాలు తెలుసుకునేందుకు ఎన్ఐఏ సాయం కోరామని, యూకేకు చెందిన అధికారులతో మాట్లాడి మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అరెస్టు చేసిన ఐదుగురిని వేర్వేరుగా విచారిస్తున్నామని, వారి బ్యాంకు ఖాతాలు సీజ్ చేశామన్నారు. 18 నెలలుగా ఆమె డీఆర్డీవో నుంచి సమాచారం సేకరించినట్లు పేర్కొన్నారు.