డ్రింక్స్‌లో డ్రగ్స్ కలిపి బలవంతంగా తాగించారు..
హర్యానాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సొనాలీ ఫోగట్ మృతి కేసులో మరో కొత్త కోణాన్ని గోవా పోలీసులు చెప్పారు. హత్యగా భావిస్తున్న ఈ కేసులో నిందితులైన ఫోగట్ సహోద్యోగులు ఇద్దరు ఆమెకు నార్త్ గోవాలోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన పార్టీలో పానీయంలో డ్రగ్స్ కలిపి బలవంతంగా తాగించారని పోలీసులు చెప్పారు.
నిందితులిద్దరూ పానీయంలో ఓ రసాయన పదార్థాన్ని కలిపి బలవంతంగా తాగించడం సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించిందని, ఇదే విషయాన్ని నిందితులు సుధిర్ సగ్వాన్, సుఖ్విందర్ సింగ్ విచారణలో ఒప్పకున్నారని కూడా ఐజీపీ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ తెలిపారు.
ఫోగట్ స్పృహ కోల్పోయిన అనంతరం ఆమెను రెస్టారెంట్‌లోని ఓ వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి, అక్కడే రెండు గంటల పాటు ఉన్నారని, అయితే అక్కడ ఏం జరిగిందనే దానిపై నిందితులు నోరు విప్పలేదన్నారు.
పానీయంలో కలిపిన రసాయన పదార్థం వలనే ఫోగట్ మరణించినట్టు అనిపిస్తుందని, ఆర్థికపరమైన విషయాలే ఇందుకు కారణమై ఉండొచ్చని తెలిపారు.