రూ.1400 కోట్ల విలువ చేసే డ్రగ్స్ మ్యావ్ మ్యావ్ స్వాధీనం... ఎక్కడ?
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ ఏకంగా రూ.1400 కోట్ల మేరకు ఉండొచ్చని ముంబై మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు తెలిపారు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నాలాసొపారా ప్రాంతంలో ఓ డ్రగ్ తయారీ కేంద్రంపై దాడి చేసిన ముంబై మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు 700 కిలోలకు పైగా నిషేధిత మెఫెడ్రోన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1,400కోట్లకు పైనే ఉంటుందని వారు చెప్పారు.
మెఫెడ్రోన్‌ను మ్యావ్ మ్యావ్ డ్రగ్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యవహారంలో అయిదుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఓ మహిళ ఉంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ పట్టభద్రుడైన 52 ఏళ్ల ప్రధాన నిందితుడు రసాయన ప్రయోగాలు చేసి ఈ మాదకద్రవ్య తయారీ ఫార్ములాను కనుగొన్నాడని పోలీసులు చెప్పారు.