శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (08:32 IST)

మేఘాలయలో కాంగ్రెస్ ఖాళీ : రాత్రికిరాత్రే 12 ఎమ్మెల్యేలు జంప్

సుధీర్ఘ చరిత్రకలిగిన కాంగ్రెస్ పార్టీకి ఎక్కకడ లేని కష్టాలు వచ్చినట్టున్నాయి. ఆ పార్టీ ఇచ్చిన టిక్కెట్లపై గెలుపొందిన ఎమ్మెల్యేలు పార్టీకి విధేయతగా ఉండటం లేదు. తమ స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా మేఘాలయ రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఏర్పడింది. రాత్రికి రాత్రి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వీరిలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా కూడా ఉండటం గమనార్హం. 
 
మేఘాలయ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లు ఉన్నాయి. గత 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 21 స్థానాల్లో గెలుపొందారు. ప్రస్తుతం ఆ పార్టీకి 17 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వీరిలో 12 మంది సభ్యులు రాత్రికిరాత్రే టీఎంసీలోకి జంప్ అయ్యారు. దీంతో రాత్రికిరాత్రే టీఎంసీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమేవున్నారు. 
 
మేఘాలయ రాష్ట్రంలో చోటుచేసుకున్న హఠాత్‌ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ ఇన్‌చార్జ్ మనీష్ చత్రత్ గురువారం ఆగమేఘాలపై మేఘాలయకు వెళ్లనున్నారు. నిజానికి ఆయన గురువారం గుజరాత్ రాష్ట్రంలో జరగనున్న పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ వర్థంతి వేడుకలో పాల్గొనాల్సివుంది. కానీ, తన పర్యటనను రద్దు చేసుకుని మేఘాలయకు వెళ్లనున్నారు.