మాస్క్ తీశారంటే జైలు ఊచలు లెక్కించాల్సిందే.. ఎక్కడ?

mask
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 16 అక్టోబరు 2020 (11:01 IST)
కరోనా వైరస్ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరి ముందున్న మార్గాలు మూడే మూడు. అందులో ఒకటి... ముఖానికి మాస్క్ ధరించడం. రెండోది సామాజిక భౌతిక దూరం పాటించడం. చివరగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం. ఈ మూడింటిని తు.చ తప్పకుండా పాటించినట్టయితే ఖచ్చితంగా కరోనాపై విజయం సాధించడం పెద్ద విషయమేమి కాదు.

అందుకే రైలు ప్రయాణ సమయంలో ప్రయాణికులకు రైల్వే శాఖ కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ముఖ్యంగా, రైళ్లలో ప్రయాణించే వాళ్లు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, స్టేషన్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రయాణం ముగిసే వరకు మాస్కు ధరించే ఉండాలని రైల్వేశాఖ తేల్చి చెప్పింది.

దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) కీలకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. రైళ్లలో, స్టేషన్‌ పరిసరాల్లో ఉమ్మివేయడం, ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలను పడవేయడం నిషిద్ధమని పేర్కొంది.

ముఖ్యంగా, పాజిటివ్‌ వచ్చినవారు, పరీక్షలకు శాంపిళ్లు ఇచ్చినవారు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరింది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారికి రైల్వే చట్టం ప్రకారం జైలు శిక్ష గానీ, జరిమానా గానీ లేదా రెండూ గానీ పడవచ్చని హెచ్చరించింది.

కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక రైళ్లకే పరిమితమైన రైల్వేశాఖ.. క్రమంగా రైళ్ల సంఖ్యను పెంచే దిశగా అడుగులు వేస్తోంది. రాజధాని, శతాబ్ది, తేజస్‌, హమ్‌సఫర్‌ సహా అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నవంబరు నుంచి పట్టాలు ఎక్కించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2021 జనవరి నాటికి పూర్తిస్థాయిలో ప్రయాణికుల రైళ్లను నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది.దీనిపై మరింత చదవండి :