శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:25 IST)

మా పార్టీ గెలిస్తే మీకు మాంసం ఫ్రీ.. సగం ధరకే మద్యం..

భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే హామీలన్నీ నెరవేరుస్తామని పార్టీలు ప్రకటిస్తున్నాయి. అయితే ఢిల్లీకి చెందిన షాంజీ విరాసత్‌ పార్టీ ముస్లింలకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ముస్లిం ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. 
 
తమ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిస్తే రంజాన్ పండుగ రోజున ముస్లింలకు సగం ధరకే మద్యం.. ఉచితంగా మాంసం ఇస్తాం అని ప్రకటించింది. ముస్లిం మహిళా ఓటర్లకు తగినంత బంగారం ఇస్తామని పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. నార్త్-ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న అమిత్ శర్మ..ఈ విషయాలను పోస్టర్ల రూపంలో ముద్రించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీటితో పాటు పీహెచ్‌డీ వరకు ఉచిత విద్య అందిస్తామని, విద్యార్థులకు మెట్రో, బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యాలను కల్పిస్తామన్నారు. 
 
ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకునే వారికి ఉచితంగా విద్యను అందిస్తామని పేర్కొన్నారు. ఆడబిడ్డ పుడితే రూ. 50 వేలు, ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ. 2,50,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా నిరుద్యోగ భృతి కింద రూ. 10 వేలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రూ. 5 వేలు పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలకు మే 12న ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.