రోడ్డు ప్రక్కన మట్టిదిబ్బలో బంగారు నాణేలు, ఎగబడిన జనం.. ఎక్కడ?
తమిళనాడు ప్రాంతం హోసూరులోని రోడ్డు ప్రక్కన ఉన్న మట్టి దిబ్బలో బంగారు నాణేలు బయటపడ్డాయి. హోసూరు బాగలూరు వెంట ఉన్న ఆ మట్టి దిబ్బలో బంగారు నాణేలు ఉన్నాయన్న సమాచారంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. స్థానికులతో పాటు రోడ్లపై వెళ్లే వాహనదార్లు, ఇరుగుపొరుగు ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడారు.
దాంతో ఆమార్గంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో కిలో మీటర్ల మేరకు అక్కడక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కాగా ఒక్కో నాణేం బరువు దాదాపు 2 గ్రాములు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పురాతన నాణేలుగా భావిస్తున్న వీటిపై అరబిక్ లిపిలో అక్షరాలు దర్శనమిచ్చాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న హోసూరు పోలీసులు హుటాహుటిన అక్కకడికి చేరుకున్నారు. ఇక్కడ మట్టి దిబ్బల్లోకి బంగారు నాణేలు ఎలా వచ్చాయనే దానిపై ఆరా తీస్తున్నారు. కాగా పోలీసులు వచ్చేలోపే బంగారు నాణేలు దొరకబుచ్చుకున్నవారు అక్కడి నుంచి జారుకున్నారు.