మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (11:33 IST)

అందుకే భారత్ కు విదేశీయులు: ఉపరాష్ట్రపతి

భారతదేశంలో చక్కని విధానాలకు (పాలసీలు) కొరత లేదని.. అయితే వీటిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

ఇందుకోసం అధికారుల పనితీరు, వారి ఆలోచనాధోరణిలో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా అధికారులకు అవసరమైన శిక్షణ ఇవ్వడం ద్వారా సేవలను మరింత పకడ్బందీగా ప్రజలకు అందించేందుకు వీలవుతుందన్నారు.

ఈ దిశగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సంస్థ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ దిశగా మరింత కృషిచేయాలని సూచించారు. ఖైరతాబాద్‌లోని ఆస్కిలో ఆ సంస్థ చైర్మన్, డైరెక్టర్ బోర్డు సభ్యులు, సెక్రటరీ జనరల్, బోధనా సిబ్బందితో జరిగిన చర్చాగోష్టిలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.

భారతదేశంలో మానవ వనరులకు, ప్రతిభకు కొరతలేదని.. వీటికి సరైన దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలను సమర్థవంతంగా అమలుచేసేలా అధికారుల సామర్థ్య నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజా సేవల పంపిణీ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని అప్పుడే సమాజంలోని చివరి వ్యక్తికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరుతుందన్నారు. 70 ఏళ్లుగా భారతదేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందిందని.. అయితే సమగ్రాభివృద్ధి జరుగుతోందా అనే విషయంపై దృష్టిసారించాలన్నారు.

పేదరికం, నిరక్షరాస్యత, కుల-మత-లింగ వివక్ష వంటి అడ్డంకులను దాటుకుని ముందుకెళ్తేనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోగలమన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, నైతికత, విలువలను నేర్చుకుని అమలుచేసేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందన్నారు.

భారతీయ సంస్కృతి, మన సామర్థ్యం, మన వంటకాలు, మన సినిమాలంటే విదేశీయులకు చాలా ఇష్టమన్నారు. అందుకే మన దగ్గర సామర్థ్య నిర్మాణం కోసం విదేశాలు తమ ప్రతినిధులను భారత్ కు పంపిస్తున్నాయన్నారు.

వీరితోపాటు ఇక్కడున్న మండలస్థాయి అధికారుల వరకు శిక్షణనిచ్చి ప్రజాసేవల వ్యవస్థను మరింత పకడ్బందీగా మార్చడంలో ఆస్కి వంటి సంస్థలు కృషిచేయాలన్నారు. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో ఉన్న, వివిధ దేశాల్లో అమలవుతున్న అత్యుత్తమ పద్ధతులను అవలంబించేందుకు ఏమాత్రం సంకోచించాల్సిన అవసరం లేదన్నారు.

సంక్షేమ పథకాల తుది లక్ష్యం అంత్యోదయమేనని.. ఇది చేరుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛభారత్, బేటీ బచావ్-బేటీ పఢావ్-బేటీ బఢావ్, జన్ ధన్ యోజన వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి అవి ప్రజా ఉద్యమాలుగా మారడమే కారణమని ఉపరాష్ట్రపతి అన్నారు.

ప్రజలను ప్రతి ప్రభుత్వ పథకంలో, కార్యక్రమంలో భాగస్వాములు చేయడం ఈ పథకాలు విజయవంతంగా అమలుచేయవచ్చన్నారు. డిజిటలీకరణ, ఆన్ లైన్ వంటి వాటి ద్వారా వ్యవస్థను మరింత పకడ్బందీగా మార్చవచ్చన్నారు.

ప్రధానమంత్రి సూచించిన రిఫార్మ్, పర్మామ్, ట్రాన్స్ ఫామ్ నినాదాన్ని సరిగ్గా అర్థం చేసుకుని.. భారతదేశ పరివర్తనలో అధికారులు మరింత అర్థవంతమైన పాత్ర పోషించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి ఆస్కిలోని వివిధ విభాగాలను సందర్శించారు.

శిక్షణార్థులతో ముఖాముఖి మాట్లాడి దిశానిర్దేశం చేశారు. చైర్మన్  పద్మనాభయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ విభాగాల అధిపతులతో తమ విభాగాల ద్వారా జరుగుతున్న అధ్యయనాలు, శిక్షణలను ఉపరాష్ట్రపతికి సవివరంగా వివరించారు. ఈ సందర్భంగా ఆస్కి పనితీరును, శిక్షణాసామర్థ్యాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.