బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (05:04 IST)

చిరంజీవి కావాలనుకుంటే దేశంలో ఏ పార్టీ అయినా ఘనస్వాగతం: నాగబాబు

ఒక రాజకీయ పార్టీ అన్నయ్య చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో  ఏ మాత్రం నిజం లేదని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు నాగబాబు స్పష్టత ఇచ్చారు.

అన్నయ్య తన సినిమా కెరీర్ పై దృష్టి పెట్టారని, కళారంగానికే జీవితం అంకితం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నాగబాబు వీడియోను పోస్టు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "చిరంజీవి రాజకీయాలు వద్దనుకున్నారు. ఆయన కావాలనుకుంటే దేశంలో ఏ పార్టీ అయినా ఘనస్వాగతం పలికి రాజ్యసభ సీటు ఇస్తుంది. రాజ్యసభ సీటు కోసం వెళ్లాల్సిన అవసరం అన్నయ్యకు లేదు అనేది నా అభిప్రాయం.

ఒకవేళ ఆయనకు అలాంటి ఆలోచనే ఉండి ఉంటే నాతో చెప్తారు. రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు లేవు, పల్లాలు లేవు. రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానమైన సెంట్రల్ మినిస్టర్ పదవి అలంకరించారు. 
 
పవన్ కళ్యాణ్ కోసం త్యాగం 
అన్నయ్య చిరంజీవి ఏ రాజకీయ పార్టీకి సపోర్టు చేయడం లేదు. అన్నయ్య ఉద్దేశం ఏంటంటే.. రాజకీయాల్లో అన్నాదమ్ములు ఇద్దరు ఉండకూడదు. ఎవరో ఒక్కరే ఉండాలి. తమ్ముడు కళ్యాణ్ బాబు రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే తాను రాజకీయాల్లో ఉండకూడదని ఎప్పుడో నిర్ణయం తీసుకొని త్యాగం చేశారు.

త్యాగం అని ఎందుకు అన్నానంటే.. కళ్యాణ్ బాబుకు ఉన్న డెడికేషన్ చూసి తనకన్నా కళ్యాణే బాగా చేయగలుగుతాడు అని అన్నయ్య అనుకున్నారు. అలా అన్నయ్య పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన నిర్ణయాన్ని కుటుంబం మొత్తం స్వాగతించాం.

చిరంజీవికి ఒక రాజకీయ పార్టీ నుంచి రాజ్యసభ సీటు లభిస్తోందని వస్తున్న వార్తలను ఎప్పటినుంచో ఖండించాలని అనుకున్నాను.  కానీ ఇదే సరైన సమయమని ఇప్పుడు ఖండిస్తున్నాను.
 
అమరావతికి సంపూర్ణ మద్దతు 
అన్నయ్య రాజధానిపై తన అభిప్రాయాన్ని చెప్తే విజయవాడకు చెందిన కొందరు నిర్మాతలు ఏదేదో మాట్లాడేశారు. అలా అభిప్రాయాలు చెప్పడం తప్పా? ఆయన ఇంటి ముందు ధర్నాలు చేయాలనే ఆలోచన మానుకోండి.

నేను, మా తమ్ముడు పవన్ కళ్యాణ్ అమరావతికి మా వంతు సపోర్ట్ చేస్తున్నాం. మా తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పోరాటం చేస్తున్నారు. దయచేసి సినిమాలు చేస్తున్న అన్నయ్యను రాజకీయాల్లోకి లాగొద్దు.

ఆయనతో రాజకీయం చేయాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దయచేసి వ్యక్తిగత స్వార్ధం కోసం తప్పుడు వార్తలను ప్రచారం చేసి మెగా అభిమానులు, జనసైనికుల్లో కన్ఫ్యూజ్ సృష్టించవద్దు" అని కోరారు.