మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 9 మే 2021 (08:42 IST)

అక్టోబరులో థర్డ్ వేవ్.. కట్టడి చేయకపోతే శ్మశానమే : డాక్టర్ మణీంద్ర అగర్వాల్

దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి తగ్గకముందే.. థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదం ఉందని, దీన్ని ఆరంభంలోనే కట్టడి చేయకుంటే ప్రమాదం తప్పదని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ డాక్టర్ మణీంద్ర అగర్వాల్ హెచ్చరించారు. 
 
ప్రస్తుతం భయపెడుతున్న రెండో దశ వ్యాప్తి జూలై నెలాఖరుకు సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతుందనీ, ఆ తర్వాత సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ అక్టోబర్‌లో థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కరోనా డాటా విశ్లేషణలో నిమగ్నమైన డాక్టర్‌ అగర్వాల్‌.. దేశంలో థర్డ్‌వేవ్‌ రాబోతున్నదంటూ ఇటీవల భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సలహాదారు విజయ్‌ రాఘవన్‌ చేసిన హెచ్చరికలతో ఏకీభవించారు. 
 
'కరోనా వైరస్‌ వ్యాప్తి పీక్‌ స్టేజ్‌కు చేరిన తర్వాత 10 నుంచి 15 రోజులపాటు ఆ దశ కొనసాగుతుంది. అనంతరం క్రమంగా కేసులు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉన్నది. ఢిల్లీ, మహారాష్ట్ర ఇప్పటికే పీక్‌స్టేజ్‌కు చేరుకోగా, పలు రాష్ట్రాలు వచ్చే వారం, పది రోజుల్లో ఆ దశకు చేరతాయి. దేశవ్యాప్తంగా జూలై చివరికల్లా సెకండ్‌ వేవ్‌ పూర్తిగా తగ్గుతుంది. అక్టోబర్‌లో మళ్లీ థర్డ్‌వేవ్‌ మొదలవుతుంది' అని వ్యాఖ్యానించారు. 
 
థర్డ్‌వేవ్‌ ఎంతకాలం కొనసాగుతుంది? దాని తీవ్రత ఎలా ఉంటుంది? అనే విషయాలపై ఇప్పుడే చెప్పలేమన్నారు. వైరస్‌ వ్యాప్తి తీవ్రత అనేక అంశాలపై ఆధాపడి ఉంటుందని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.