బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (16:00 IST)

ఇండో-పాక్ యుద్ధం వస్తే?

పుల్వామా ఘటనకు తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సరిహద్దుల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. జైషే స్థావ‌రాల‌పై భార‌త వాయుసేన దాడి చేసి వాటిని భూస్థాపితం చేసింది. ఈ నేప‌థ్యంలో రెండు దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఫలితంగా ఇండో-పాక్ సరిహద్దు వద్ద భారత- పాకిస్థాన్ సైన్యం పహారా కాస్తోంది. 
 
ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ.. జైషే సంస్థకు చెందిన అధినేతకు భద్రతినిస్తూ.. ఉగ్రవాద చర్యలకు వంత పాడుతున్న పాకిస్థాన్‌పై తగిన చర్యలు తీసుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌తో యుద్ధానికైనా సిద్ధమంటోంది. 
 
ఒకవేళ యుద్ధమనేది జరిగితే.. ఎవరి సత్తా ఏంతో అనే దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. ఆర్థికంగా, జనాభా పరంగా రెండు దేశాలు ఏ స్థాయిలో వున్నాయో కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్థికపరంగా భారత్ ముందుంది. కానీ పాకిస్థాన్ ఆర్థిక విలువ 30వేల 700 కోట్ల డాలర్లు మాత్రమే. మరి భారత్‌ ఆర్థిక వ్యవస్థ దాదాపు 2 లక్షల 79వేల కోట్ల డాలర్లు. 
 
అలాగే భారత జ‌నాభా 120 కోట్లు, ఇక పాక్ జ‌నాభా 20 కోట్లు మాత్ర‌మే. భార‌త్ త‌న మిలిట‌రీ కోసం గ‌త బ‌డ్జెట్‌లో సుమారు రూ.5800 కోట్ల డాల‌ర్లు కేటాయించింది. ఇక ప్రపంచ దేశాల్లో మిలిటరీ పరంగా భారత్ అయిదవ స్థానంలో వుంది. ఇక పాకిస్థాన్ తన మిలిటరీ బడ్జెట్ కోసం రూ.1100 కోట్ల డాలర్లు వెచ్చించింది.  
 
పాక్ ఆర్మీలో సుమారు 11 లక్షల సైనికులున్నారు. ఇక భార‌త ఆర్మీలో 33 లక్షల మంది సైనికులు వున్నారు. భార‌త్ వ‌ద్ద యుద్ధ ట్యాంక్‌లు సుమారు 3500 ఉన్నాయి. ఇది పాకిస్థాన్ కంటే సుమారు వెయ్యి ఎక్కువ‌. ర‌ష్యా త‌యారు చేసిన టీ-90 యుద్ద ట్యాంకులే భార‌త్ వ‌ద్ద ఎక్కువ సంఖ్య‌లో ఉన్నాయి. 
 
ఇక పాకిస్థాన్ వద్ద మాత్రం ఎక్కువగా చైనా నుంచి దిగుమతి చేసుకున్న యుద్ధ విమానాలు వున్నాయి. అలాగే భారత్ దాదాపు పదివేల కేంద్రాల నుంచి ఆర్మీ యూనిట్లను నిర్వహిస్తోంది. కానీ పాకిస్థాన్‌లో మాత్రం కేవలం ఐదువేల యూనిట్లలో మాత్రమే ఈ పని జరుగుతోంది. 
 
ఇక భారత్ వ‌ద్ద సుమారు 3100 ఇన్‌ఫాంట‌రీ యుద్ధ వాహ‌నాలుంటే.. పాక్ వ‌ద్ద 425 యుద్ధ విమానాలు ఉన్నాయి. వీటిల్లో ఫ్రాన్స్‌, అమెరికా, చైనా దేశాల‌కు చెందిన జెట్స్ ఉన్నాయి. ఇండియా వ‌ద్ద సుమారు 800 యుద్ధ విమానాలు ఉన్నాయి. 
 
కానీ వాటిల్లో ఎక్కువ శాతం ర‌ష్యా వాడిన విమానాలే. ఈ జాబితాలో మిగ్ 21, మిగ్ 27 యుద్ధ విమానాలు ఉన్నాయి. భార‌త్ వ‌ద్ద బ‌ల‌మైన సుఖోయ్ 30 విమానాలు కూడా ఉన్నాయి. అయితే భార‌త వైమానిక ద‌ళం వ‌ద్ద క‌నీసం 200 సుఖోయ్‌లు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇక నేవీలో మాత్రం భార‌త్ చాలా మెరుగ్గా ఉంది. కానీ కాశ్మీర్ గురించి జరుగుతున్న యుద్ధం కావడంతో.. నేవీ వుపయోగం వుండకపోవచ్చు. 
 
ఇందులో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన అంశాల్లో అణ్వాయుధం ఒక‌టి. ఈ విష‌యంలో మాత్రం పాకిస్థాన్‌కు ముందుందని తెలుస్తోంది. రెండు దేశాలూ 1990వ ద‌శ‌కంలోనే న్యూక్లియ‌ర్ బాంబుల‌ను ప‌రీక్షించాయి. అయితే స్టాక్‌హోమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ రీచ‌ర్చ్ ఇన్స్‌టిట్యూట్ ప్ర‌కారం.. పాకిస్థాన్ వ‌ద్ద సుమారు 140 నుంచి 150 వ‌ర‌కు అణ్వాయుధాలు ఉన్నాయి. 
 
భార‌త్ వ‌ద్ద మాత్రం 130 నుంచి 140 వ‌ర‌కే న్యూక్లియ‌ర్ వార్‌హెడ్స్ ఉన్న‌ట్లు సమాచారం. కానీ అణ్వాయుధాల‌ను మోసుకెళ్లే స‌త్తా మాత్రం భార‌త్‌కే ఎక్క‌ువగా ఉన్న‌ది. భారత్ వద్ద మూడు అగ్ని రాకెట్లున్నాయి. ఈ రాకెట్లు క‌నీసం 5 వేల కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను షూట్ చేయ‌గ‌ల‌వు. ఇక పాక్ ద‌గ్గ‌ర ఉన్న షెహీన్ రాకెట్ మాత్రం కేవ‌లం 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను మాత్ర‌మే ధ్వంసం చేయ‌గ‌ల‌దు. 
 
ఒకవేళ అదే అనివార్యమైతే.. రెండు దేశాలకు ప్రాణనష్టమే మిగులుతుంది. ఇండో-పాక్ యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమైనా జరుగవచ్చునని సంకేతాలివ్వడమే కారణం.