శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 27 ఫిబ్రవరి 2021 (15:54 IST)

పోలీసుల శరీరానికే కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్‌ నేరాలపై ఎలక్ట్రానిక్‌ నిఘా, తాట తీస్తారంతే

ట్రాఫిక్‌ నేరాలపై ఎలక్ట్రానిక్‌ నిఘా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్‌ పరికరాలను విస్తృతంగా వినియోగించడం ద్వారా నిబంధనల ఉల్లంఘనలకు ముకుతాడు వేయాలన్న అభిప్రాయానికి వచ్చింది. ఇందులో భాగంగా పోలీసులు, రవాణా సిబ్బందికి కవచ కెమెరాలు (బాడీ వేరబుల్‌ కెమెరా) ఏర్పాటు చేయాలని కేంద్ర రహదారి, రవాణాశాఖ ప్రతిపాదించింది.
 
రహదారుల వెంబడి, పోలీసు వాహనాల డ్యాష్‌ బోర్డుల్లోనూ ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులోనే స్పీడ్‌, సీసీటీవీ కెమెరా, స్పీడ్‌గన్‌, వాహనాల బరువును పసిగట్టే సెన్సర్లను పొందుపరచాలని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర మోటారు వాహన నిబంధనలు-1989ని సవరిస్తూ ముసాయిదా విడుదల చేసింది.
 
ఇందులో రూల్‌ 139ఏ కింద కొత్తగా ‘కంట్రోల్‌ ఆఫ్‌ ట్రాఫిక్‌’ అని, 139బీ కింద ‘ఎలక్ట్రానిక్‌ మానిటరింగ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ సేఫ్టీ’  కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. వీటిపై అభ్యంతరాలున్నవారు 30 రోజుల్లోపు సలహాలు, సూచనలు పంపాలని ఆహ్వానించింది.
 
 ఈ నిబంధనలు అమల్లోకి వస్తే ఇలా వుంటుంది. పోలీసులు ధరించిన ఈ-కెమెరాలతోపాటు, దారుల్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలు, చిత్రాల ఆధారంగా చర్యలు తీసుకొనే అధికారం పోలీసులు, రవాణా అధికారులకు దఖలు పడుతుంది.
 
 రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని హైరిస్క్‌, హైడెన్సిటీ కారిడార్లు, జాతీయ, రాష్ట్ర రహదారులు, రద్దీ కూడళ్లు, రాష్ట్ర రాజధానులు, 10 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ఇలాంటి ఎలక్ట్రానిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పరికరాలు ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఎక్కడైనా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
 
చోదకులు నిర్ణీత వేగాన్ని మించి వాహనాన్ని నడిపినప్పుడు; అనధీకృత స్థలాల్లో వాహనాలను ఆపినప్పుడు; పార్కింగ్‌ చేసినప్పుడు; డ్రైవర్లు భద్రతా చర్యలు తీసుకోకుండా వాహనాలను నడిపినప్పుడు; హెల్మెట్లు ధరించనప్పుడు.. ఈ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా చలానాలు జారీ చేయడానికి అధికారం కలుగుతుంది.
 
ఎర్రలైటు ఉన్నా ఆగకుండా వాహనాలను నడిపినప్పుడు; వాహనాలు ఆపాలన్న సంకేతాలను ఉల్లంఘించినప్పుడు; ఫోన్‌లో మాట్లాడుతూ నడిపిప్పుడు; నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను ఓవర్‌టేక్‌ చేసినప్పుడు; ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్‌ చేసినప్పుడు; దురుసుగా, ప్రమాదకరంగా వాహనం నడిపినప్పుడు; సీటు బెల్టు ధరించనప్పుడు; నిర్ణీత బరువుకు మించిన లోడ్‌తో వెళ్తున్నప్పుడు కూడా ఈ కెమెరాల్లోని దృశ్యాలను ఆధారంగా చేసుకొని చలానాలు జారీ చేయవచ్చు.
 
రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి పరికరాలను ఏర్పాటు చేస్తే ఆ విషయాన్ని ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలి. చలాన్లు రాస్తే.. ఆ విషయంపై 15 రోజుల్లోపు వాహనదారునికి నోటీసు పంపాలి. చలాన్లను నిర్దిష్ట గడువులోగా చెల్లించేలా నిబంధన విధించాలి. ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా సేకరించిన సాక్ష్యాధారాలను కనీసం 30 రోజుల పాటు భద్రపరచాలి.