1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

సజావుగా సాగుతున్న చంద్రయాన్-3 ప్రయాణం

chandrayaan-3
జాబిల్లిపైకి ఇస్రో పంపిన 'చంద్రయాన్-3' రాకెట్ ప్రయాణం సజావుగా సాగుతున్నట్టు వెల్లడించింది. శుక్రవారం ఈ రాకెట్‌ను నింగిలోకి పంపించారు. శనివారం 'చంద్రయాన్-3' కక్ష్యను మార్చామని తెలిపారు. ప్రస్తుతం ఈ మిషన్ సజావుగా సాగుతుందని, తనకు నిర్ధేశించిన మార్గంలో పయనిస్తుందని వెల్లడించింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించిన వివరాల మేరకు.. చంద్రయాన్-3 ప్రస్తుతం 41762 కిలోమీటర్లు * 173 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తుందని, క్రమక్రమంగా కక్ష్యను పెంచి అంతిమంగా చంద్రుడివైపునకు దీన్ని మళ్లించాలనేది ఇస్రో ప్లాన్ అని తెలిపింది. 
 
కాగా, చంద్ర మండలంపై ఉన్న రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో చేపట్టిన మూడో మిషన్ చంద్రయాన్-3. జూలై 14వ తేదీన మధ్యాహ్నం 2.35 గంటలకు దీన్ని ప్రయోగించారు. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యేలా ప్లాన్ చేశారు. సౌత్ పోల్‌పై పరిశోధన చేపట్టడమే దీని లక్ష్యం. ఈ క్రమంలో చంద్రయాన్-3లో లాండర్ విజయవంతంగా చంద్రుడిపై దింపాలని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ల్యాండర్ సాయంతో చంద్రుడి దక్షిణ ధృవపు రహస్యాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
విమానంలో నుంచి "చంద్రయాన్-3" రికార్డింగ్ 
 
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. తొలి దశ ప్రయోగం విజయవంతమైంది. అయితే, ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడాన్ని ఓ విమాన ప్రయాణికుడు విమానంలో నుంచి వీడియో తీశాడు. ఇపుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఆకాశంలో మేఘాలను చీల్చుకుంటూ అస్త్రంలా దూసుకునిపోతుంది. ఈ వీడియోను నెటిజన్లు అమితంగా వీక్షిస్తూ, వైరల్ చేస్తున్నారు. 
 
ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగిపోయేలా చంద్రయాన్-3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. ఆ దృశ్యాన్ని ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తమ ప్రొఫైల్స్‌లో డీపీ పెట్టుకున్నారు. ఇపుడు చంద్రయాన్-3 ప్రయోగానికి సంబంధించి మరో వీడియో నెట్టింట వైరల్ అయింది. ఇస్రో రాకెట్ నింగిలోకి దూసుకెళుతుండగా విమానంలోని ఓ ప్రయాణికుడు రికార్డు చేశాడు. 
 
బ్రహ్మాస్త్రం తన లక్ష్యం దిశగా దూసుకెళుతున్నట్టు ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఇస్రో మెటీరియల్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ వీపీ వెంకటకృష్ణన్ ఈ వీడియోను షేర్ చేశారు. చంద్రయాన్-3 ప్రయోగాన్ని వీక్షించాలంటూ విమాన పైలెట్ స్వయంగా ప్రకటన చేశాడు. దీంతో ఓ ప్రయాణికుడు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళుతున్న దృశ్యాలను వీడియో తీశాడు. చెన్నై నుంచి ఢాకాకు బయలుదేరిన విమానంలో ప్రయాణించిన ప్రయాణికుడు ఈ విడియోను తీశాడు.