1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 ఆగస్టు 2023 (12:59 IST)

సూర్యుడి గుట్టు విప్పేందుకు సిద్ధమవుతున్న ఇస్రో... మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం..

adityaan
చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో సంబరాలు చేసుకుంటున్న దేశానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో శుభవార్త చెప్పింది. ఈ యేడాది మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించింది. వరుస చంద్రయాన్ ప్రయోగాల ద్వారా చంద్రుడిపై పరిశోధనలు చేస్తున్నట్టే.. సూర్యుడి గుట్టు విప్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఇస్రో పేర్కొంది. 
 
సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేయనున్నట్టు ఇస్రో వెల్లడించింది. ఆదిత్య ఎల్-1 సిద్ధమైందని, ప్రయోగానికి సిద్ధంగా ఉందని అహ్మదాబాద్‌లోని ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ ఎం దేశాయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్-1ను మోసుకుంటూ పీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుందని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను నీలేశ్ ఎం దేశాయ్ వివరించారు.
 
సూర్యుడి పుట్టుక, అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు ఇస్రో ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేయనుంది. దీన్ని భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజ్ పాయింట్-1 (ఎల్-1) వద్ద ఉండే సుదీర్ఘమైన దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. సుమారు 127 రోజుల ప్రయాణం తర్వాత ఆదిత్య ఎల్-1 ఈ కక్ష్యలోకి చేరుతుంది. ఈ ఉపగ్రహం ద్వారా అతి దగ్గరి నుంచి సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు. తద్వారా సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు.
 
రోదసిలో సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు భారత్ పంపిస్తున్న తొలి అబ్జర్వేటరీ స్పేస్ క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. దీని ద్వారా సూర్య వ్యవస్థ గురించి ముఖ్యమైన వివరాలు తెలుస్తాయి. ఇందులో మొత్తం ఏడు పే లోడ్లు ఉంటాయి. వీటిలో విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ పేలోడ్ ద్వారా సూర్యుడి చిత్రాలు, స్పెక్ట్రోస్కోపిపై దృష్టి సారించవచ్చు. దీని ద్వారా సూర్యుడికి ఎక్కడి నుంచి శక్తి లభిస్తుందో మరింతగా తెలుసుకోవచ్చు.