తమిళనాడు ఎన్నికలు : స్టాలిన్ అల్లుడు ఇంట్లో ఐటీ సోదాలు
తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఈ నెల ఆరో తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీంతో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులోభాగంగా, శుక్రవారం స్టాలిన్ కుమార్తె భర్త (అల్లుడు) నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 100 మంది పోలీసుల భద్రతతో ఈ సోదాలు చేశారు.
స్టాలిన్ కూతురు సెంతమారై తన భర్త శబరీశన్‌తో పాటు ఈసీఆర్ రోడ్డులో ఉన్న నీలాంకరైలో నివసిస్తున్నారు. వీరికి చెందిన నాలుగు ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే నేత ఇండ్లల్లో ఐటీ సోదాలు జరగడం ఇది రెండవసారి. గత నెలలో డీఎంకే నేత ఈ వేలూ ఇంట్లో కూడా ఐటీశాఖ సోదాలు చేసిన విషయం తెలిసిందే. వేలూ ఇంటి నుంచి భారీ స్థాయిలో నగదును ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.