1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 మార్చి 2021 (14:08 IST)

కోవై (సౌత్) నుంచి కమల్ - కొళత్తూరు నుంచి స్టాలిన్.. చెప్పాకం నుంచి....

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, ప్రధాన పార్టీల నేతలు పోటీ చేసే నియోజకవర్గాల పేర్లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఆయన కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. 
 
అలాగే, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ చెన్నై నగరంలోని కొళత్తూరు నుంచి, ఆయన తనయుడు ఉదయనిధి స్టాలిన్ చెన్నై నగరంలోని చెప్పాక్కం - తిరువళ్లికేణి స్థానం నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష డీఎంకే శుక్రవారం అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసింది. 
 
ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో డీఎంకే ఓ ఇంటర్వ్యూను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పార్టీ వ్యవస్థాపకులు కరుణానిధి కాలంలోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. ఆ సమయంలో కరుణానిధి బృందం ముందు స్టాలిన్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. 
 
ప్రస్తుతం కూడా డీఎంకేలో ఇదే ఆనవాయితీ నడుస్తోంది. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సమయంలోనే ఉదయనిధి స్టాలిన్‌ను పార్టీ పక్కన పెట్టిందని, ఆయన ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. కానీ చివరకు ఉదయనిధి బరిలోకి నిలిచారు. 
 
మరోవైపు సీనియర్లకు మొదటి జాబితాలో చోటుదక్కింది. కే.ఎన్. నెహ్రూ తిరుచ్చి నుంచి, సెంథిల్ బాలాజీ కరూర్ నుంచి, టీఆర్‌బీ రాజా మన్నార్గుడి నుంచి, తంగా తమిళ్ సెల్వన్ బోడినాయకనూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు. 
 
'నేను కొళత్తూరు నుంచి బరిలోకి దిగుతున్నాను. ముఖ్యమంత్రి పళనిస్వామి సెల్వం ప్రత్యర్థిగా సంపత్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి బరిలోకి దిగుతున్నారు. డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంకు ప్రత్యర్థిగా తంగా తమిళ సెల్వన్ బరిలోకి దిగుతున్నారు. కాట్పాడి నుంచి డీఎంకే ప్రధానకార్యదర్శి దురై మురుగన్ బరిలోకి దిగుతున్నారు.’’ అని అధ్యక్షుడు స్టాలిన్ పేర్కొన్నారు.