గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (11:17 IST)

కమల్ హాసన్ మొత్తం ఆస్తుల విలువ ఎంత?, సొంత కారు లేని ఎంకే స్టాలిన్!

తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సినీ నటుడు కమల్ హాసన్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. కోయంబత్తూరు జిల్లాలోని కోవై సౌత్ నుంచి పోటీ చేస్తున్న కమల్... సోమవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇందులో చరాస్తులు రూ.41.80 కోట్లుకాగా, స్థిరాస్తులు రూ.131.84కోట్లుగా చూపించి, మొత్తం ఆస్తులను రూ.176.93 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో రూ.45 కోట్ల మేరకు అప్పులు ఉన్నట్టు తెలిపారు.
 
ఇకపోతే, డీఎంకే అధినేత స్టాలిన్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో ప్రకటించారు. తనకు రూ.2.24 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.4.94 కోట్ల చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. స్థిరాస్తులలో వ్యవసాయ భూమి, రెసిడెన్సియల్ భవంతులను చూపించారు. 
 
తన చేతిలో రూ.50 వేల నగదు ఉందని తెలిపారు. మరోవైపు తన భార్య పేరిట రూ.30,52,854 విలువైన చరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. తన భార్యకు రూ.24.77 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని వెల్లడించారు.
 
ఎమ్మెల్యేగా వస్తున్న జీతం, బ్యాంకు డిపాజిట్లు, అద్దెల ద్వారా తనకు ఆదాయం వస్తోందన్నారు. తనకు సొంత కారు లేదని తెలిపారు. బ్యాంకులు, ప్రభుత్వ ఏజెన్సీలకు ఎలాంటి బకాయిలు లేవని పేర్కొన్నారు.
 
స్టాలిన్ కుమారుడు ఉదయనిధి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన కూడా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో ప్రకటించారు. తనకు రూ. 21.13 కోట్ల చరాస్తులు, రూ.6.54 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.