మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 12 నవంబరు 2017 (13:20 IST)

#Sasikala : నేలమాళిగల్లో గుట్టలుగా డబ్బు, వజ్రాభరణాలు!

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, బహిష్కృత నేత టీటీవీ దినకరన్, వారి కుటుంబీకులు, అనుచరులు, బినామీ ఇళ్ళలో ఆదాయపన్ను శాఖ అధికారులు గత నాలుగు రోజులుగా సోదాలు చేస్తున్నారు.

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ, బహిష్కృత నేత టీటీవీ దినకరన్, వారి కుటుంబీకులు, అనుచరులు, బినామీ ఇళ్ళలో ఆదాయపన్ను శాఖ అధికారులు గత నాలుగు రోజులుగా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాల్లో విస్తుపోయే ఆస్తులు బయటపడుతున్నాయి. నేలమాళిగల్లో దాచిన కోట్లాది రూపాయల నగదు, విలువైన వజ్రాభరణాలు, ఖరీదైన రోలెక్స్ వాచీలు.. ఇలా ఒకటేమిటి.. బయటపడుతున్న ఒక్కో దానిని చూసి ఆదాయ పన్ను అధికారులు నివ్వెరపోతున్నారు.
 
ముఖ్యంగా, శశికళ సోదరుడు దివాకరన్ నిర్వహిస్తున్న ఓ లేడీస్ హాస్టల్‌లో జరిపిన దాడుల్లో నేలమాళిగలు బయటపడ్డాయి. మన్నార్‌గుడి ప్రాంతంలోని సుందరకొట్టాయ్‌లో ఉన్న ఈ హాస్టల్‌లోకి అధికారులు అడుగుపెట్టకుండా దినకరన్ అనుచరులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాదాపు 60 గంటలపాటు నిర్వహించిన సోదాల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడినట్టు తెలుస్తోంది.
 
గత నాలుగు రోజులుగా జరుగుతున్న సోదాల్లో ఇప్పటి వరకు రూ.6 కోట్ల నగదు, 15 కేజీల బంగారం, రూ.1200 కోట్ల విలువైన ఆస్తులు బయటపడినట్టు సమాచారం. చెన్నైలోని మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన జయ టీవీ కార్యాలయం, నమదు ఎంజీఆర్ దినపత్రిక సీఈవో వివేక్ జయరామన్, టి.నగర్ హబీబుల్లా రోడ్డులోని కృష్ణప్రియ నివాసాల్లో అధికారులు శనివారం మూడో రోజు సోదాలు నిర్వహించారు. ఇటీవల పెరోల్‌పై బయటకు వచ్చిన శశికళ స్థిరాస్తుల లావాదేవీలు జరిపినట్టు అనుమానిస్తున్న అధికారులు దానిపైనా దృష్టి సారించారు.
 
ఇదిలావుండగా, శశికళ సంబంధీకులు పది బోగస్ కంపెనీల పేరిట 1000 కోట్ల రూపాయల పన్నులు చెల్లించకుండా అవకతవకలకు పాల్పడ్డారని ఐటీశాఖ నిర్ధారించింది. బినామీ పేర్లతో 10 బోగస్‌ సంస్థలను ప్రారంభించిన శశికళ కుటుంబీకులు పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడ్డారని ఐటీ వర్గాలు తెలిపాయి. పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ బోగస్‌ కంపెనీలు, సొంత వ్యాపారాలు, పార్టీ కార్యాలయాల ద్వారా పెద్దఎత్తున నగదు మార్పిడికి పాల్పడ్డారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
 
శశికళ డైరెక్టర్‌‌గా ఉన్న ఫెన్సీ స్టీల్‌, రెయిన్‌ బో ఎయిర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, శుక్రా క్లబ్‌, ఇండో - దోహ కెమికల్స్‌ అనే నాలుగు సంస్థలు గత నెలలో మూతపడ్డాయి. ఈ ఇండో-దోహా కెమికల్స్ సంస్థలో ఇళవరసి, ఆమె బంధువులు డైరెక్టర్లు. ఇక చెన్నైలోని నీలాంగరైలోని శశికళ బంధువు భాస్కరన్‌ ఇంట్లో లెక్క చూపని 7 కేజీల బంగారాన్ని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, శశికళకు చెందిన 315 బ్యాంకు ఖాతాలనూ స్తంభింపజేసినట్లు తెలుస్తోంది.