వైష్ణోదేవి ఆలయానికి వెళుతూ లోయలో పడిన బస్సు...
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కత్రాకు వెళుతున్న భక్తుల బస్సు ఒకటి లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ బస్సు అమృతసర్ నుంచి కత్రాకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. వంతెన పైనుంచి జారి లోయలో బోల్తాపడింది. దీంతో ఎనిమిది మంది చనిపోగా మరో 20 మంది వరకు గాయపడ్డారు.
ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 20 మందిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, జమ్మూ సీనియర్ ఎస్పీ చందన్ కోహ్లీ తెలిపారు. క్షతగాత్రులను జమ్మూలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.