సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2024 (08:45 IST)

జమ్మూకాశ్మీర్‌ తొలి దశలో 61 శాతం పోలింగ్

polling
పదేళ్ల తర్వాత జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో మొత్తం 61 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, బుధవారం తొలి దశ పోలింగ్ జరిగింది. తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. దాదాపు 59 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల ముఖ్య కమిషనర్ పీకే పోలె వెల్లడించారు. కీశ్త్‌వాడ్ నియోజవర్గంలో అత్యధికంగా 77 శాతం ఓటింగ్ నమోదు కాగా, పూల్వామాలో అత్యల్పంగా 46 శాతం పోలింగ్ నమోదైందని ఆయన వెల్లడించారు.
 
కాగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికలు. ఈ తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 61 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. జమ్మూ, కాశ్మీర్‌లో జరిగిన గత ఏడు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఇదే అత్యధిక పోలింగ్ కావడం గమనార్హం. పోస్టల్ బ్యాలెట్, మారుమూల ప్రాంతాల పోలింగ్ వివరాలు కూడా అందితే ఈ పోలింగ్ శాతం మరింత పెరగవచ్చని ఈసీ వెల్లడించింది. 
 
బుధవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయిన పోలింగ్ రోజంతా స్థిరంగా కొనసాగింది. మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు, నడవలేని వారు కూడా రాష్ట్రమంతటా పోలింగ్ బూత్ల వద్ద ఓపిగ్గా వేచివుండి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ సీట్లకు తొలిదశలో 24 సీట్లకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 16 కాశ్మీర్ లోయలో ఉండగా.. 8 జమ్మూ ప్రాంతంలో ఉన్నాయి. 
 
మొత్తం 23 లక్షల మందికిపైగా ఓటర్లు ఈ ఎన్నికల్లో 219 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా దళాలతో విస్తృతంగా బందోబస్తు కల్పించారు. బిజ్బెహరా, డీహెచ్ పోరా వంటి ఒకటి రెండు చోట్ల రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణలు తప్ప ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగ లేదు. సెప్టెంబరు 25, అక్టోబరు ఒకటవ తేదీన మరో రెండు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.