సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (17:43 IST)

శశికళకు జైలు నుంచి విముక్తి... విడుదల తేదీ ఖరారు?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుజీవితం అనుభవిస్తున్న శశికళకు త్వరలోనే జైలు నుంచి విముక్తికలగనున్నట్టు సమాచారం. ఈ కేసులో గత మూడేళ్లుగా ఆమె జైలుశిక్షను అనుభవిస్తున్నారు. అయితే, ఆమె సత్ ప్రవర్తన కారణంగా ఆమెకు జైలు నుంచి విముక్తి కలిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. 
 
ప్రస్తుతం ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో ఉన్నారు. కోర్టులో 10 కోట్ల సొంత పూచీకత్తు చెల్లించి, జనవరి 27 న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. తన శిక్షా కాలాన్ని తగ్గించాలంటూ ఆమె జైలు అధికారులకు దరఖాస్తు కూడా పెట్టుకున్నారు. 
 
ఈ దరఖాస్తును పరప్పణ జైలు అధికారులు.. ఉన్నతాధికారులకు పంపించారు. 'శిక్షా కాలాన్ని తగ్గించాలంటూ ఆమె దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ దరఖాస్తును మేము ఉన్నతాధికారుల పరిశీలనార్థం పంపించాం' అని అధికారులు పేర్కొన్నారు. అయితే అధికారులు మాత్రం దీనిపై అధికారికంగా ఇంకా స్పందించాల్సి ఉంది.