అపరాధం చెల్లించిన న్యాయవాది.. ఒకటి రెండు రోజుల్లో శశికళ రిలీజ్!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్... త్వరలోనే జైలు నుంచి విడుదలకానున్నారు. ఈమెకు కోర్టు విధించిన రూ.10.10 కోట్ల అపరాధాన్ని ఆమె తరపు న్యాయవాది చెందూర్ పాండ్యన్ చెల్లించారు. దీంతో శశికళ రిలీజ్ కావడం ఖాయమైపోయింది.
ఈ అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ, జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్‌లకు ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధించింది. అయితే, జయలలిత మరణించడంతో, ఈ కేసులో ముద్దాయిలుగా తేలిన మిగిలిన ఇద్దరూ బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టుకు చెల్లించాల్సిన రూ.10.10 కోట్ల జరిమానాను కోర్టుకు చెల్లించిన ఆమె తరపు న్యాయవాదులు, అందుకు సంబంధించిన రసీదును శిశికళ ఉంటున్న పరప్పణ అగ్రహార జైలు అధికారులకు పంపించారు. దీంతో ఆమె విడుదలకు మార్గం సుగమం అయింది.
శశికళ తరపు న్యాయవాది రాజా చెందూర్ పాండ్యన్ జరిమానాగా చెల్లించాల్సిన రూ.10.10 కోట్లను డీడీ రూపంలో న్యాయమూర్తికి అందించారు. అన్ని ప్రక్రియలు సజావుగానే సాగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లో చిన్నమ్మ విడుదల కావచ్చని ఆమె తరపు న్యాయవాది పాండ్యన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, శశికళ జైలు నుంచి విడుదలైనంత మాత్రాన అన్నాడీఎంకేలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవని సీఎం ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు.