కర్కోటకుడు... తమ్ముడికి ఉద్యోగం వచ్చిందని కుటుంబ సభ్యులకు నిప్పంటించి...
తమ్ముడికి ఉద్యోగం వచ్చిందని జీర్ణించుకోలేని అన్న ఇంటికి నిప్పంటించి కుటుంబ సభ్యులను సజీవ దహనం చేసాడు. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా మానిక్‌చక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న మదన్‌తోలా గ్రామంలో మఖాన్ మోందల్ అనే వ్యక్తి తన ఇద్దరు సోదరులు, తల్లితో కలిసి పెంకుటింటిలో ఉంటున్నారు.
కారుణ్య నియామకం కింద ఇటీవల అతని సోదరుడు గోవిందాకు ఉద్యోగం వచ్చింది. కల్మష హృదయుడైన మఖాన్ మోందల్ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా ఇంటికి నిప్పంటించాడు. దాంతో తమ్ముడు గోవిందా (28), అన్న వికాశ్ (32), గోవిందా ఇద్దరు కుమార్తెలు మృతిచెందారు. చిన్నారులిద్దరూ అక్కడికక్కడే మృతిచందగా, గోవిందా, వికాశ్‌లు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
గోవిందా భార్య, వికాశ్ భార్య, కుమారుడు, కుమార్తె మాల్దా మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మఖాన్ తల్లి ఆ సమయంలో మరో గదిలో నిద్రిస్తుండటంతో ప్రమాదం నుండి తప్పించుకుంది. మఖాన్ భార్య పుట్టింట్లో ఉండటంతో ఆమె కూడా ప్రమాదం నుండి తప్పించుకోగలిగిందని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల వారి కుటుంబంలో గేడు మోందల్ అనే వ్యక్తి నేషనల్ వాలంటీర్ ఫోర్సులో ఉద్యోగం చేస్తూ మరణించాడు. కారుణ్య నియామకం క్రింద వికాశ్ సహాయంతో గోవిందా ఉద్యోగం సంపాదించాడు. వారి మరో సోదరుడు లక్ష్మణ్ ఢిల్లీలో ఉంటున్నాడు.