మాస్క్ ధరించలేదా? ఐతే లక్ష కట్టండి.. లేదంటే రెండేళ్లు జైలు శిక్ష
కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఇప్పటి వరకు సరైన మందులేని కరోనా వైరస్ కట్టడికి భౌతికదూరం పాటించడం, మాస్క్ ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఇంటి నుంచి బయట అడుగు పెడితే మాస్క్ తప్పనిసరి. కానీ, చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
మాస్కులు లేకుండా రోడ్లపై తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం మాస్కులు లేని వారిపై రూ. వెయ్యి ఫైన్ వేస్తోంది. తాజాగా, జార్ఖండ్ ప్రభుత్వం మాస్క్ ధరించనివారిపై కొరడా రుళుపించే నిర్ణయం తీసుకుంది.. మాస్క్ ధరించనివారి నుంచి భారీ జరిమానాలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది.
లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా.. ఒకవేళ ఎవరైనా ముఖానికి మాస్క్ లేకుండా బయటకు వెళ్తే.. ఏకంగా రూ. లక్ష జరిమానా విధించాలని నిర్ణయానికి వచ్చింది. అంతే కాదు.. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి అదనంగా రెండేళ్ల జైలుశిక్షను కూడా అమలు చేసే నిర్ణయం తీసుకున్నారు.