శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (09:37 IST)

శారీరక సంబంధం ఉన్నా.. ప్రియురాలిని వదిలివేయొచ్చు : హైకోర్టు తీర్పు

ఇటీవలి కాలంలో చాలా మంది యువతీయువకులు సహజీవనం పేరుతో పెళ్లి కాకుండానే ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఇలాంటి వారంతా శారీరకంగా కలసుకుంటూ, పిల్లలకు కూడా జన్మనిస్తున్నారు. కొంతకాలం లివ్ ఇన్ రిలేషన్‌షిప్ చేసిన తర్వాత వారి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టయితే వారు విడిపోతున్నారు. ఈ తరహా సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ఓ రేప్ కేసులో సంచలన తీర్పును వెల్లడించింది. 
 
ప్రేమించిన అమ్మాయితో శారీరిక సంబంధం ఏర్పరుచుకున్నా.. ఆ అమ్మాయితో బ్రేకప్ చెప్పడం పెద్ద తప్పేమి కాదంటూ ఢిల్లీ హైకోర్ట్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వినడానికి ఇది ఎబ్బెట్టుగా ఉన్నా.. న్యాయస్థానం దాన్ని పెద్ద నేరం కాదంటూ తీర్పు వెల్లడించింది. 2016లో ఓ మహిళ తనపై అత్యాచారానికి ఒడిగట్టాడంటూ.. ఓ వ్యక్తి మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు అఘాయిత్యం చేశాడని అందులో పేర్కొంది. ఆ తర్వాత చివరికి పెళ్లి అనేసరికి మొహం చాటేశాడని సదరు మహిళ వాపోయింది.
 
అదేసమయంలో ఆ యువతి తల్లిదండ్రులు మాత్రం.. తమ కుమార్తెకు ఆమె ప్రేమించిన వ్యక్తితో పెళ్ళి చేసేందుకు తమకు ఇష్టం లేదని చెప్పారు. పైగా, అంతేకాక ఇష్టపూర్వకంగానే తమ కుమార్తె అతడితో సంబంధం ఏర్పర్చుకుందని చెప్పడంతో కోర్టు సదరు వ్యక్తిపై కేసును కొట్టేసింది. అయితే, ఐపీసీ చట్టం ప్రకారం ప్రేమించిన అమ్మాయిని వదిలేయడం శిక్షించదగినదేమీ కాదు.. ఇద్దరూ కూడా తమ ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం ఏర్పరుచుకోవడం నేరమేమీ కాదంటూ కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పుపై ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే... సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు.